Supreme Court: గృహహింస బాధితులకు రక్షణ
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:19 AM
సుప్రీంకోర్టు గృహహింస బాధితులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక అధికారులను ఆరు వారాల్లోపు నియమించాలని రాష్ట్ర, కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలకు ఆదేశించింది. గృహహింస నిరోధక చట్టం సమర్థంగా అమలయ్యేలా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టి బాధితులకు ఉచిత న్యాయ సహాయం, షెల్టర్ హోంలను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది.
జిల్లా, తాలూకా స్థాయుల్లో ప్రత్యేక అధికారుల నియామకం ఆరు వారాల్లోపు పూర్తి చేయాలి
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, జూన్ 3: గృహహింస బాధితులకు రక్షణ కల్పించటానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక అధికారులను ఆరు వారాల్లోపు నియమించాలని రాష్ట్ర, కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గృహహింస నిరోధక చట్టం నిబంధనలు సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీ్‌షచంద్రశర్మలతో కూడిన ధర్మాసనం గత నెల 20వ తేదీన ఇచ్చిన తీర్పు తాలూకు పూర్తి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఈ తీర్పు కాపీని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. తీర్పులోని ముఖ్యాంశాలు..
మహిళా, శిశు సంక్షేమశాఖలో జిల్లా, తాలూకా స్థాయిల్లో పని చేస్తున్న అధికారుల్లో కొందరిని గృహహింస బాధితుల కోసం ‘రక్షణ అధికారులు’గా నియమించాలి. దీనికోసం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంత ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శులు సమన్వయంతో పని చేసి నియామకాల్ని ఆరు వారాల్లోగా పూర్తి చేయాలి. రక్షణ అధికారులు గృహహింస నిరోధక చట్టంలోని సెక్షన్ 9కి అనుగుణంగా విధులను నిర్వర్తించాలి.
గృహహింస నిరోధక చట్టం సెక్షన్ 11 ప్రకారం.. బాధిత మహిళలకు చట్టం కల్పించే రక్షణ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలి. చట్టం గురించి పోలీసు, న్యాయవ్యవస్థలతోపాటు ఇతర శాఖల అధికారులకు కూడా ఎప్పటికప్పుడు శిక్షణనివ్వాలి. చట్టం అమలును నిర్ణీత కాలవ్యవధుల్లో క్రమం తప్పకుండా సమీక్షించాలి. కేంద్రప్రభుత్వం కూడా కీలకపాత్ర పోషించాలి.
బాధిత మహిళలకు ఉచితంగా, తక్షణ న్యాయ సహాయం అందించాలని చట్టం నిర్దేశిస్తోంది. ఈ మేరకు జాతీయ న్యాయ సేవల అథారిటీ తగు చర్యలు చేపట్టాలి.
బాధిత మహిళలు తలదాచుకోవటానికి షెల్టర్‌హోం, నారీనికేతన్ వంటి గృహ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. జిల్లా, తాలూకా స్థాయిల్లో వీటి వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. 10 వారాల్లోపు ఇది జరగాలి.
ఇదీ నేపథ్యం
పలు రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో గృహహింస నిరోధక చట్టం సరిగా అమలు కావటం లేదంటూ ‘వి ద ఉమెన్’ అనే స్వచ్ఛందసంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టం అమలుకు ప్రత్యేకంగా అధికారులను నియమించకుండా.. ‘సమీకృత శిశు సంక్షేమ పథకం’ (ఐసీడీఎస్) సిబ్బందికి, అంగన్‌వాడీ కార్యకర్తలకు అదనంగా బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిపింది. ఇది వారి పని భారాన్ని పెంచటంతో.. చట్టం అమలుపై వారు దృష్టి పెట్టలేకపోతున్నారని.. ఫలితంగా బాధిత మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే, ప్రత్యేకంగా అధికారులను నియమించాలని, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news