Share News

Supreme Court: భారత్‌.. ధర్మసత్రం కాదు!

ABN , Publish Date - May 20 , 2025 | 06:13 AM

భారత్‌లో ఆశ్రయం కోరుతూ ఓ శ్రీలంక జాతీయుడు వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: భారత్‌.. ధర్మసత్రం కాదు!

  • ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు

  • శరణార్థుల అంశంపై సుప్రీం వ్యాఖ్యలు

  • ఆశ్రయం కోరిన శ్రీలంక జాతీయుడి పిటిషన్‌ తిరస్కరణ

న్యూఢిల్లీ, మే 19: భారత్‌లో ఆశ్రయం కోరుతూ ఓ శ్రీలంక జాతీయుడు వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్‌ ధర్మశాల (ఉచిత సత్రం) కాదని, ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో దేశం ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంది. అసలు ఇక్కడ స్థిరపడేందుకు మీకేం హక్కు ఉందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఎల్‌టీటీఈతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో 2015లో ఒక శ్రీలంక జాతీయుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. 2018లో ట్రయల్‌ కోర్టు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద అతన్ని దోషిగా తేల్చి, 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే 2022లో అతను మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. అయితే శిక్ష పూర్తయిన వెంటనే దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.


తాను చట్టబద్ధమైన వీసాపైనే భారత్‌కు వచ్చానని, తిరిగి తమ దేశానికి వెళ్తే తన ప్రాణాలకు ముప్పు అని వాదించాడు. అంతేగాక తన భార్య, పిల్లలు కూడా భారత్‌లోనే స్థిరపడ్డారని పేర్కొన్నాడు. దాదాపు మూడేళ్లుగా నిర్బంధంలో ఉన్నానని, బహిష్కరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, తనకు ఇక్కడే ఆశ్రయం అవకాశం కల్పించాలని పిటిషనర్‌ అయిన శ్రీలంక తమిళుడు అభ్యర్థించాడు. పిటిషన్‌పై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన శరణార్థులందరికీ భారత్‌ ఆశ్రయం ఇవ్వాలా? మేం ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బంది పడుతున్నాం. విదేశీ శరణార్థులను ఆశ్రయించేందుకు ఇదేమీ ధర్మశాల కాదు’ అని జస్టిస్‌ దత్తా అన్నారు. రాజ్యాంగంలోని 19, 21 అధికరణలను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్‌ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పిటిషనర్‌ను చట్టప్రకారమే కస్టడీలోకి తీసుకున్నారని, అతని నిర్బంధం ఆర్టికల్‌ 21ను ఉల్లంఘించ లేదని, అదేవిధంగా ఆర్టికల్‌ 19 అనేది భారత్‌ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అసలు ఇక్కడ స్థిరపడేందుకు మీకేం హక్కు ఉందని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. పిటిషనర్‌ శరణార్థి అని, శ్రీలంక వెళ్తే అతని ప్రాణాలకు ప్రమాదమని న్యాయవాది వాదించగా.. అయితే వేరే దేశానికి వెళ్లండని కోర్టు పేర్కొంది.

Updated Date - May 20 , 2025 | 06:13 AM