Pahalgam Attack: కశ్మీర్‌లోనే పహల్గాం ఉగ్రవాదులు
ABN , Publish Date - May 02 , 2025 | 04:39 AM
పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంకా ఆ ఉగ్రవాదులు కశ్మీర్ అడవుల్లో దాక్కున్నారని, ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు నిఘా వర్గాలు ప్రకటించాయి.
దట్టమైన అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడి
న్యూఢిల్లీ/శ్రీనగర్, మే 1: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రత దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అణువణువూ శోధిస్తున్నాయి. అయితే ఆ ఉగ్రవాదులు ఇంకా దేశం విడిచి పారిపోలేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా వెల్లడించింది. వీరంతా దక్షిణ కశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లో దాక్కున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలిసింది. దాడి జరిపిన తర్వాత ఎవరిపై ఆధారపడొద్దని ఆహారం, ఇతరత్రా సామగ్రి తీసుకొని పక్కా ప్లాన్‌తో అటవీ ప్రాంతంలోకి పారిపోయారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో మరికొంత మంది ఉగ్రవాదులు ఉండే అవకాశం లేకపోలేదని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక ప్రాథమిక దర్యాప్తు మేరకు.. దాడికి 48 గంటల ముందే నలుగురు ఉగ్రవాదులు బైసరన్ లోయకు చేరుకున్నారు. అరు, బేతాబ్ లోయలతో సహా మరో నాలుగు ప్రాంతాల్లో ఉగ్రవాదులు తొలుత రెక్కీ నిర్వహించి స్థానికులను కలిసి ఆరా తీశారని దాడి తర్వాత ఎన్‌ఐఏ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు భద్రత తక్కువగా ఉండే బైసరన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదుల వద్ద అధునాతన సమాచార పరికరాలున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వారు వాడిన పరికరాల్లో సిమ్‌లు ఉండవని.. ఇతరులు గుర్తించకుండా చిన్నపాటి ఎన్‌క్రిప్టెడ్ సందేశాలు పంపవచ్చని చెబుతున్నాయి. దాడి ప్రారంభమయ్యే (మధ్యాహ్నం 1.15 గంటల) వరకు భద్రతా దళాలు గుర్తించకుండా ఉగ్రవాదులు 3 శాటిలైట్ ఫోన్లు ఉపయోగించారని తెలిసింది.
ఆర్మీ చీఫ్‌తో ప్రధాని మోదీ భేటీ
ప్రధాని మోదీ బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ ఇందులో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News