UP school: యూపీ స్కూల్‌కు 1965 యుద్ధ వీరుడి పేరు తొలగింపు.. ప్రధాని పేరు పెట్టడంపై రచ్చ..
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:56 PM
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ విద్యా యంత్రాంగం చేసిన ఓ పని తీవ్ర విమర్శల పాలవుతోంది. ధాముపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పేరును మార్చడం ఆగ్రహ జ్వాలలను రగిలిస్తోంది. గతంలో ఈ పాఠశాలకు 1965 యుద్ధ వీరుడు వీర్ అబ్దుల్ హమీద్ పేరు పెట్టారు.

ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లోని ఘాజీపూర్ విద్యా యంత్రాంగం చేసిన ఓ పని తీవ్ర విమర్శల పాలవుతోంది. ధాముపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పేరును మార్చడం ఆగ్రహ జ్వాలలను రగిలిస్తోంది. గతంలో ఈ పాఠశాలకు 1965 యుద్ధ వీరుడు వీర్ అబ్దుల్ హమీద్ (Abdul Hameed) పేరు పెట్టారు. తాజాగా అతడి పేరును తీసేసి ప్రధానమంత్రి మోదీ (PM Modi) పేరును పెట్టారు. దీంతో అమరవీరుడి కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి (UP School Name).
అబ్దుల్ హమీద్ పేరును తీసేయడంపై ఆయన మనవడు జమీల్ ఆలం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన తాత భారతదేశం కోసం చేసిన అత్యున్నత త్యాగానికి గౌరవసూచకంగా పాఠశాలకు అతడి పేరు పెట్టారని, అధికారులు ఏకపక్షంగా ఇలా మార్చడం సరికాదని, ఇది అమర వీరుడిని అవమానించడమేనని విమర్శించాడు. అంతేకాదు ఈ విషయమై ప్రాథమిక విద్యా అధికారికి తన ఫిర్యాదు చేశాడు, తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరాడు. అయితే ఈ విషయంపై పాఠశాల హెడ్మాస్టర్ వాదన మరో రకంగా ఉంది. తమ పాఠశాలకు అబ్దుల్ హమీద్ పేరు అధికారికంగా పాఠశాల పత్రాలలో నమోదు కాలేదని చెబుతున్నారు.
ఏదేమైనా ఈ వివాదంపై ప్రాథమిక విద్యా అధికారి దర్యాఫ్తు ప్రారంభించారు. తాను స్వయంగా పాఠశాలను సందర్శించి ఈ విషయంపై దర్యాప్తు చేస్తానని రావు హామీ ఇచ్చారు. ఏదైనా వ్యత్యాసాలు గుర్తిస్తే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం, యుద్ధ సమయాల్లో పోరాడి మరణించిన ముస్లిం యోధులను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని, స్థానిక ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ విమర్శించారు. అబ్దుల్ హమీద్ 5వ తేదీ వరకు చదువుకున్న పాఠశాలను కనీసం ఆయన జ్ఞాపకార్థంగా ఉండనివ్వాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..