Share News

Supreme Court: నలుగురిలో అననప్పుడు అట్రాసిటీ చట్టం వర్తించదు

ABN , Publish Date - Feb 01 , 2025 | 05:04 AM

తమిళనాడుకు చెందిన ఒకవ్యక్తిపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆ చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఆర్‌), సెక్షన్‌ 3(1)(ఎస్‌) ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను అవమానించడమే లక్ష్యంగా అందరి ముందూ కావాలని దూషిస్తేనే దాన్ని బహిరంగంగా జరిగిన ఘటనగా భావించాలని..

Supreme Court: నలుగురిలో అననప్పుడు అట్రాసిటీ చట్టం వర్తించదు

కావాలనే.. అందరి ఎదుటా అవమానించే

ఉద్దేశంతో దూషిస్తేనే ఆ చట్టం వర్తిస్తుంది

సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జనవరి 31: అవమానించే ఉద్దేశంతో అందరి ఎదుటా కులం పేరుతో దూషించనప్పుడు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టడం కుదరదంటూ.. తమిళనాడుకు చెందిన ఒకవ్యక్తిపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆ చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఆర్‌), సెక్షన్‌ 3(1)(ఎస్‌) ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను అవమానించడమే లక్ష్యంగా అందరి ముందూ కావాలని దూషిస్తేనే దాన్ని బహిరంగంగా జరిగిన ఘటనగా భావించాలని.. నాలుగు గోడల మధ్య ఒక కార్యాలయంలో జరిగిన ఘటనను ఈ సెక్షన్ల కింద నేరంగా పరిగణించలేమని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ మాహి్‌సతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి చేసిన అప్పీలుపై ఈ నిర్ణయాన్ని వెలువరించింది. భూమి పట్టాలో పేరు చేర్పుపై తన తండ్రి ఇచ్చిన దరఖాస్తు పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఆ వ్యక్తి 2021 సెప్టెంబరులో స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారు. వివరాలు అడిగే క్రమంలో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలో అతడు తన కులం గురించి ప్రస్తావించి..


‘‘నీలాంటివాళ్లని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తే మీరు ఇలాగే చేస్తారు’’ అన్నాడని.. కులం పేరుతో దూషించి, అసభ్యకరమైన పదజాలంతో అవమానించడని పేర్కొంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీనిపై తిరుచిరాపల్లి కోర్టులో కేసు నడిచింది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురయింది. దాంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం.. ‘‘ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం కూడా ఆ ఘటన బాధితుడి కార్యాలయంలోనే, నాలుగు గోడల మధ్యనే జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాతే.. ఆయన సహోద్యోగులు అక్కడికి వచ్చారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని సెక్షన్‌ 3(1)(ఆర్‌), సెక్షన్‌ 3(1)(ఎస్‌) ఈ కేసులో వర్తించవు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను కొట్టివేసింది.


ఇవి కూడా చదవండి

PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్

Parliament: శీతాకాల సభల్లో సెగలే!

Read Latest National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 05:12 AM