Share News

DNA test: అక్రమ సంతానమైనా కూడా.. ‘ఆ తండ్రి’ని డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించలేం

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:56 AM

ఇది మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత గోప్యత వ్యవహారమని, అతని అనుమతి లేకుండా డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించడం కుదరదని స్పష్టం చేసింది.

DNA test: అక్రమ సంతానమైనా కూడా.. ‘ఆ తండ్రి’ని డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించలేం

తన తండ్రి ఎవరో తేల్చాలన్న యువకుడి పిటిషన్‌పై సుప్రీం

నూఢిల్లీ, జనవరి 28: తాను ఫలానా వ్యక్తికి, తన తల్లికి పుట్టిన అక్రమ సంతానమని నమ్ముతున్నానని, అతను తన తండ్రో కాదో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా తేల్చాలని ఒక యువకుడు పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత గోప్యత వ్యవహారమని, అతని అనుమతి లేకుండా డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించడం కుదరదని స్పష్టం చేసింది. కేరళలోని కోచికి చెందిన మహిళ 1989లో వివాహం చేసుకుని, 1991లో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. 2001లో ఆమెకు కుమారుడు జన్మించాడు. 2003లో భర్తతో విడిపోయింది. 2006లో వారికి విడాకులు మంజూరయ్యాయి. వెంటనే ఆమె కోచి మున్సిపల్‌ అధికారులను కలిసి కుమారుడి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంలో తండ్రి పేరు మార్చాలని కోరింది. భర్తతో ఉండగానే తాను వివాహేతర సంబంధంలో ఉన్నానని, ఆ సంబంధం వల్ల పుట్టిన సంతానమే ఈ అబ్బాయి అని చెప్పింది. 2007లో స్థానిక కోర్టు ఆ మూడో వ్యక్తికి, పిల్లాడికి డీఎన్‌ఏ పరీక్ష చేయాలని ఆదేశించింది. దీనిపై ఆ మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.


పిల్లాడు కడుపులో పడిన సమయంలో భార్యాభర్తలు కలిసి లేరని నిరూపించగలిగితేనే మూడో వ్యక్తిని డీఎన్‌ఏ పరీక్ష చేసుకోవాలని ఆదేశించగలమని హైకోర్టు చెప్పింది. భార్యాభర్తలు కలిసి ఉంటే విడాకులు పొందిన 280 రోజుల్లోపు పుట్టిన పిల్లాడు కూడా ఆ తండ్రికి సక్రమ సంతానమే అవుతాడని సాక్ష్యాధారాల చట్టాన్ని ఉటంకిస్తూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కుమారుడు మూడో వ్యక్తి నుంచి భృతి కోరుతూ 2015లో కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్‌ వేశాడు. తనకు అనేక శస్త్ర చికిత్సలు అయ్యాయని, తన వైద్యం ఖర్చులు తల్లి భరించలేక పోతోందని పిటిషన్లో పేర్కొన్నాడు. తన వైద్య ఖర్చులకు, చదువుకు చట్టబద్ధమైన తండ్రి నుంచి కూడా ఎలాంటి సాయం అందడం లేదని ప్రస్తావించాడు. కుటుంబ న్యాయస్థానం తనయుడికి అనుకూలంగా తీర్పిచ్చింది. మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కూడా భృతిని ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో మూడో వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిల్లాడు కడుపులో పడిన సమయంలో సదరు మహిళతో.. భర్త, మూడో వ్యక్తి ఇద్దరూ కాంటాక్టులో ఉన్నారని భావించినా కుమారుడు మాజీ భర్తకు సక్రమ సంతానమే అవుతాడని సుప్రీం కోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది.



ఇవి కూడా చదవండి..

Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..

Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 01:57 AM