Sanchar Saathi App: ఇకపై ఫోన్‌లో ఆ యాప్ తప్పనిసరేం కాదు..
ABN , Publish Date - Dec 02 , 2025 | 03:28 PM
సైబర్ నేరాలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘సంచార్ సాతీ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. . భారత్‌లో అమ్ముడయ్యే ప్రతీ ఫోన్‌లో ‘సంచార్ సాతీ’ యాప్ తప్పని సరిగా ఉండాలని మొబైల్ ఫోన్ కంపెనీలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం సైబర్ నేరాలపై దృష్టి సారించింది. సైబర్ నేరాలను అరికట్టడంలో భాగంగా ‘సంచార్ సాతీ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో అమ్ముడయ్యే ప్రతీ ఫోన్‌లో ‘సంచార్ సాతీ’ యాప్ తప్పని సరిగా ఉండాలని మొబైల్ ఫోన్ కంపెనీలకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ‘సంచార్ సాతీ’ యాప్‌ను ‘స్నూపింగ్ యాప్’ అని అన్నారు. ఆమె స్పందిస్తూ.. ‘అది అర్థం లేని పని. ప్రతీ భారత పౌరుడికి రైట్ టు ప్రైవసీ ఉంది.
ఇది కేవలం మొబైల్ ఫోన్లపై నిఘా ఉంచటం మాత్రమే కాదు. వాళ్లు ప్రతీ విషయంలో దేశాన్ని శాసించాలని చూస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఈ యాప్‌పై స్పందించారు. కేంద్రాన్ని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనికేషన్స్ మినిష్టర్ జ్యోతిరాదిత్య సింధియా ‘సంచార్ సాతీ’ యాప్’పై క్లారిటీ ఇచ్చారు. ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...
‘సంచార్ సాతీ యాప్ ఫోన్‌లో ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. మీరు దాన్ని యాక్టీవ్ చేసుకోవాలని అనుకుంటే చేసుకోండి. లేదంటే డిలీట్ చేసేయండి. ఇది కస్టమర్ ప్రొటెక్షన్‌కు సంబంధించిన విషయం. అందులో ఏదీ తప్పని సరి కాదు. మీరు ఆ యాప్ వాడాలని అనుకుంటే వాడండి. లేదంటే డిలీట్ చేసేయండి. దేశంలోని ప్రతీ వ్యక్తికి సైబర్ నేరాల నుంచి రక్షించే ఓ యాప్ ఉందని తెలీదు. దాని గురించి ప్రజలకు తెలిసేలా చేయటం మా బాధ్యత. అందుకే ఫోన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశాము. నిజాలు చూడాలన్న ఇష్టం లేని వారికి.. ఇది నిజం అని చెప్పలేము కదా..’ అంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
హరీష్ రావు చేతిలోకి బీజేపీ.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
రాజధానిలో రెండో విడత భూ సమీకరణకు ఆదేశాలు జారీ