Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఇలా వెళ్లిన దుండగుడు.. వెలుగులోకి కొత్త ఫొటో..
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:40 PM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన దుండగుడి కొత్త ఫొటో వెలుగులోకి వచ్చింది. తన ముఖాన్ని రెడ్ టవల్‌తో కప్పుకొని సైఫ్ ఇంట్లోని మెట్లు ఎక్కుతూ కనిపించాడు.
Mumbai: బాలీవుడు నటుడు సైఫ్ అలీఖాన్ కత్తి దాడి ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని, ముందుగా అతడు షారుఖ్ ఖాన్ ఇంటిని టార్గెట్ చేశాడని అది కుదరక సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని రకరకాల కథనాలు వినిపించాయి. అయితే, అవన్నీ నిజాలు కాదని, నిందితుడు తమ అదుపులో లేడని మొంబై పోలీసులు కొట్టిపరేశారు. ప్రస్తుతం అతడి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ముఖానికి టవల్ కప్పుకొని..
సైఫ్ ను పొడిచిన వ్యక్తి నిన్న నటుడి ఇంట్లో మెట్లు ఎక్కుతున్న ఫొటో తాజాగా వెలుగులోకి వచ్చింది. అతను తన ముఖాన్ని రెడ్ టవల్ తో కప్పుకుని, బ్యాగ్‌తో మెట్లు ఎక్కుతూ కనిపించాడు. కాగా, నిన్న నిందితుడు ఆరవ అంతస్తు నుండి దాడి తర్వాత బయటకు వెళ్తున్న ఫొటో బయటపడిన సంగతి తెలిసిందే. అందులో మెట్లు దిగుతూ కనిపించాడు. ఘటనా స్థలం నుంచి పారిపోతుండగా పట్టుబడకుండా ఉండేందుకు బట్టలు మార్చుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన తర్వాత బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో అతను కనిపించాడని వర్గాలు తెలిపాయి.
నటుడు సేఫ్..
దుండగుడిని మొదట సైఫ్ చిన్న కొడుకు జెహ్ గదిలో అతని పనిమనిషి గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆమె అతడిని ఆపలేకపోయింది. ఆ సమయంలో వెంటనే అప్రమత్తమైన సైఫ్ దుండగుడిని అడ్డుకోబోయాడు. కానీ, నిందితుడు నటుడిని కత్తితో దాడి చేసి తప్పించుకున్నాడు. ఆరు కత్తిపోట్లతో ఉన్నసైఫ్ ను కుటుంబసభ్యులు సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేయించారు. నటుడు కోలుకుంటున్నారని, ఐసీయూ నుంచి బయటకు తరలించినట్లు ఆస్పత్రిలోని సీనియర్ వైద్యుడు తెలిపారు. కత్తి 2 మి.మీ లోతుకు వెళ్లి ఉంటే అతనికి తీవ్ర గాయమై ఉండేదని లీలావతి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నీరాజ్ ఉత్తమని తెలిపారు.