Tariff War : డోనాల్డ్ ట్రంప్ భారతదేశ వృద్ధిని అంగీకరించలేకపోతున్నారు : కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:18 PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీద భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ వృద్ధిని ట్రంప్ అంగీకరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో..
భోపాల్, ఆగష్టు 10 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీద భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ వృద్ధిని ట్రంప్ అంగీకరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఒక కార్యక్రమానికి హాజరైన రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ పై ట్రంప్ విధించిన అధిక సుంకాలను మంత్రి తీవ్రంగా విమర్శించారు. ప్రపంచ శక్తులు భారతదేశ వేగవంతమైన వృద్ధిని చూసి అసూయపడుతున్నాయని పేర్కొన్నారు. ట్రంప్ మీద సూటిగా చేసిన విమర్శలలో రాజ్ నాథ్ సింగ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 'సబ్కే బాస్'(అందరికీ మేమే బాస్) అనే పదప్రయోగం చేశారు. అందరికీ మేమే బాస్ అనుకునే వాళ్లకి భారత వృద్ధి నచ్చలేదన్నారు. తన సందేశాన్ని అత్యంత దృఢంగా, పూర్తి స్పష్టంగా చెప్పేశారు రాజ్ నాథ్ సింగ్. భారతదేశం సూపర్ పవర్ గా మారకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు.
'కొంతమంది భారతదేశం పురోగతిని అంగీకరించలేకపోతున్నారు. వారు దానిని పాజిటివ్‌గా తీసుకోవడం లేదు. భారతదేశం ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోంది? అని మదనపడుతున్నారు. ' మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాటిని మరింత ఖరీదైనదిగా చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి' అని ఆయన అన్నారు. భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ఖరీదైనవిగా చేయడం ద్వారా, ఇతర దేశాలు వాటిని దూరం చేసే ప్రయత్నంగా అమెరికా ట్రేడ్ టారిఫ్స్ ను అభివర్ణించారు మంత్రి రాజ్ నాథ్. కానీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న వేగం చూస్తే, ఏ ప్రపంచ శక్తి కూడా మనం సూపర్ పవర్ గా మారకుండా ఆపలేవు. అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అమెరికా, భారతదేశంపై 50% సుంకాలు, జరిమానాలను విధించిన సంగతి తెలిసిందే. ఈ చర్యను భారత ప్రభుత్వం 'అన్యాయం.. అసమంజసం' అని వ్యాఖ్యానించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఉదయం మధ్యప్రదేశ్ లోని రైసెన్ జిల్లాలో ఉమారియా గ్రామంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) 'బ్రహ్మ' రైల్ హబ్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆపరేషన్ సిందూర్, 'ఆత్మనిర్భర్' లేదా స్వావలంబనగా మారడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా మంత్రి ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
డిప్యూటీ సీఎం 2 ఓటరు ఐడీలు కలిగి ఉన్నారన్న తేజస్వి యాదవ్.. క్లారిటీ
గ్లూ అడిక్షన్.. బామ్మను చంపేసిన యువకుడు