Share News

Poverty: భారీగా తగ్గిన తీవ్ర పేదరికం

ABN , Publish Date - Jun 08 , 2025 | 05:46 AM

ప్రపంచ బ్యాంకు గణాంకాలను పేర్కొంటూ... కేంద్రం దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. 2011-12 సంవత్సరంలో దేశంలో 27.1 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం రేటు 2022-23 నాటికి 5.3 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది.

Poverty: భారీగా తగ్గిన తీవ్ర పేదరికం

దేశంలో 27.1% నుంచి 5.3 శాతానికి

26 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి

దశాబ్ద కాలంలో రికార్డు స్థాయి మార్పు

ప్రపంచబ్యాంకు గణాంకాలపై కేంద్రం

న్యూఢిల్లీ, జూన్‌ 7: పేదరిక నిర్మూలనలో భారత్‌ రికార్డు స్థాయిలో దూసుకెళుతోంది. దేశంలో సుమారు దశాబ్దకాలంలో తీవ్ర పేదరికం రేటు భారీగా తగ్గింది. ప్రపంచ బ్యాంకు గణాంకాలను పేర్కొంటూ... కేంద్రం దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. 2011-12 సంవత్సరంలో దేశంలో 27.1 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం రేటు 2022-23 నాటికి 5.3 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది. 2011-12లో 34.4 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉండగా.. 2022-23 నాటికి ఆ సంఖ్య 7.5 కోట్లకు తగ్గిందని చెప్పింది. ఆ 11 ఏళ్ల కాలంలో సుమారు 26.9 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని స్పష్టం చేసింది. 2011-12లో దేశంలోని అత్యంత పేదల్లో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, మధ్య ప్రదేశ్‌లోనే 65 శాతం మంది ఉండేవారు. ఇప్పుడు తగ్గిన సంఖ్యలో కూడా వారు మూడింట రెండు వంతులు ఉన్నారు. 2021 మారకం ప్రకారం రోజుకు 3 డాలర్లు ఖర్చు చేసే స్థోమత.. అనే అంతర్జాతీయ పేదరిక రేఖను ఆధారంగా చేసుకుని ప్రపంచ బ్యాంకు మన దేశంలో పేదరికాన్ని మదింపు చేసింది.


దీనిలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదరికం బాగా తగ్గినట్లు తేలిందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి 11 ఏళ్ల సమయంలో తగ్గిందని చెప్పింది. ఇక 2017 నాటి పేదరిక రేఖ ఆధారంగా రోజుకు 2.15 డాలర్లు ఖర్చు చేయగలిగే విషయంలో జనాభాలో 2.3 శాతం మంది మాత్రమే అత్యంత పేదరికంలో ఉన్నారని, 2011-12లో 16.2 శాతంతో పోలిస్తే ఇది భారీ తగ్గుదల అని తెలిపింది. 2022లో 2.15 డాలర్ల అంచనా విషయంలో పేదల సంఖ్య 3.36 కోట్లకు తగ్గగా, అది 2011లో 20.5 కోట్లుగా ఉండేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక బహుముఖీయ పేదరిక సూచీ (ఎంపీఐ)లో దేశం గణనీయంగా పురోగతి సాధించింది. 2005-06లో 53.4 శాతంగా ఉన్న ఆ సూచీ.. 2019-21కి 16.4 శాతానికి, 2022-23కు 15.5 శాతానికి తగ్గింది.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 05:46 AM