Tax Revenue: కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు మరింత కోత?
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:37 AM
ఆర్థిక సంఘం ఆ మేరకు సిఫారసు చేస్తే.. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందా? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దశలవారీగా చర్యలు తీసుకోనుందా? ఈ ప్రశ్నలకు ఔనని చెబుతూ రాయిటర్స్ వార్తాసంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం ఉన్న 41 శాతం వాటాను
40 శాతానికి తగ్గించే యోచన
వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు
అక్టోబరులో ఆర్థికసంఘం ప్రతిపాదన!
4.8ు ఆర్థికలోటు అంచనాలే కారణం
ఆచరణలోకి వస్తే.. కేంద్రానికి ఏటా
రూ.35 వేల కోట్ల మిగులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: కేంద్రం, బీజేపీయేతర రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో.. మోదీ సర్కారు మరో కోతకు సిద్ధమైందా? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41ు నుంచి 40శాతానికి తగ్గించి, 1ు మేర కోత విధించనుందా? ఆర్థిక సంఘం ఆ మేరకు సిఫారసు చేస్తే.. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందా? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దశలవారీగా చర్యలు తీసుకోనుందా? ఈ ప్రశ్నలకు ఔనని చెబుతూ రాయిటర్స్ వార్తాసంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. మూడు వేర్వేరు విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ.. కేంద్రం తీసుకోబోయే చర్యలను గురించి వివరించింది. తాజా బడ్జెట్ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు జీడీపీలో 4.8శాతంగా ఉంది. రాష్ట్రాల ద్రవ్యలోటు కేంద్ర జీడీపీలో 3.2శాతంగా ఉంది. ఈ లోటును తగ్గించేందుకు పన్నువాటాలో కోతకు కేంద్రం సిద్ధమైనట్లు రాయిటర్స్ కథనం స్పష్టం చేసింది. 1980లో 20శాతంగా ఉన్న రాష్ట్రాల వాటా క్రమంగా 41శాతానికి పెరిగిందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందులో 1% కోతకు సన్నాహాలు చేస్తోందని పేర్కొంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వానికి సుమారుగా రూ.35 వేల కోట్లు మిగులుతాయని, ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరంలో వసూలయ్యే పన్నులను బట్టి ఇది ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది.
వ్యూహాత్మకంగా ముందుకు
పన్ను వాటా కోతకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. తొలుత(బహుశా మార్చి నెలాఖరులోగా) మోదీ నేతృత్వంలో జరగనున్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 1ు పన్ను వాటా కోతకు ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించింది. వెంటనే ఆ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక సంఘానికి పంపుతుందని వివరించింది. అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత.. అక్టోబరు 31లోపు కేంద్ర ఆర్థిక సంఘం 1ు పన్ను వాటా కోతను అధికారికంగా సిఫారసు చేస్తుందని తెలిపింది. అయితే.. కేంద్ర క్యాబినెట్ ప్రతిపాదనను ఆర్థిక సంఘం అలాగే సిఫారసు చేయాలని లేదు. పన్ను వాటాను పెంచడం లేదా.. ఇంకా తగ్గించడం ఆర్థిక సంఘం చేతుల్లో ఉంటుంది. నిజానికి జీడీపీలో రాష్ట్రాలు 60ు వాటాను అందిస్తున్నాయని, 2017 జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. రాష్ట్రాలకు సొంతంగా పన్నులను పెంచుకునే అవకాశాలు లేకుండా పోయాయయని రాయిటర్స్ వివరించింది. కొవిడ్ సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌చార్జీలను విధించిందని, వాటిల్లో ఏమాత్రం వాటా దక్కకుండా.. రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని వివరించింది.
రాష్ట్రాలతో మరింత దూరం?
కేంద్ర ప్రభుత్వ తీరుపై బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి. 1ు పన్ను కోత జరిగితే.. కేంద్రం-రాష్ట్రాల మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదముందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే.. కేంద్ర ఆర్థిక సంఘం ప్రగతిశీలతను సాధించడమే శిక్షగా తమకు అన్యాయం చేస్తూ.. జనాభా పేరుతో ఉత్తరాదికి నిధులను తరలిస్తోందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందీ భాష విషయంలో తమిళనాడులోని స్టాలిన్ సర్కారు.. పన్నుల వాటా, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారంటూ పశ్చిమబెంగాల్ సహా.. దక్షిణాది రాష్ట్రాలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే..!
మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ
Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్
For National News And Telugu News