Share News

Maha Kumbh Mela : 42 కోట్ల మంది

ABN , Publish Date - Feb 08 , 2025 | 05:51 AM

మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల్లోని భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలి వస్తున్నారు. శుక్రవారం నాటికి త్రివేణి సంగమంలో 42 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సంఖ్య అమెరికా, కెనడా దేశాల్లోని ప్రజల కంటే ఎక్కువ కావడం విశేషం. గతనెల 13న ప్రారంభమై ఈనెల 26తో ముగిసే ఈ మహా ఉత్సవంలో పుణ్యం

Maha Kumbh Mela : 42 కోట్ల మంది

ఇప్పటి వరకు కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు

10న త్రివేణి సంగమానికి రాష్ట్రపతి

మహా కుంభ్‌నగర్‌లో మరో అగ్నిప్రమాదం

ఇస్కాన్‌తో సహా 12 క్యాంపులు దగ్ధం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల్లోని భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలి వస్తున్నారు. శుక్రవారం నాటికి త్రివేణి సంగమంలో 42 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సంఖ్య అమెరికా, కెనడా దేశాల్లోని ప్రజల కంటే ఎక్కువ కావడం విశేషం. గతనెల 13న ప్రారంభమై ఈనెల 26తో ముగిసే ఈ మహా ఉత్సవంలో పుణ్యం స్నానం చేసే వారి సంఖ్య 50 కోట్లు దాటుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి వంటి మూడు అమృత స్నానాలు పూర్తయినా భక్తుల తాకిడి తగ్గలేదు. మౌని అమావాస్య రోజున 8 కోట్ల మందికిపైగా, మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30, ఫిబ్రవరి 1న 2 కోట్ల మందికి పైగా, పౌష్య పౌర్ణమికి 1.7 కోట్ల మంది, వసంత పంచమి నాడు 2.5 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితర ప్రముఖులు ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమంలో పుణ్యన్నానాలు ఆచరించారు. ఈనెల 10న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇక్కడికి రానున్నారు. బిహార్‌ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ శుక్రవారం సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు.


నటనకు ఇషికా గుడ్‌బై

సనాతన ధర్మం పాటించడం కోసం ఇకపై నటనకు గుడ్‌బై చెబుతున్నట్లు బాలీవుడ్‌ బ్యూటీ ఇషికా తనేజా తెలిపారు. సనాతన ధర్మం పాటించే క్రమంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. గతనెల 29న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో గురు దీక్ష తర్వాత ఆమె మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించారు. ఆధ్యాత్మిక సేవకు తాను అనుసంధానం అయ్యానని, మహా కుంభమేళాలో దివ్యమైన శక్తి ఉందన్నారు. 2017లో వచ్చిన ఇందు సర్కార్‌ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఉమన్‌ అచీవర్‌గా 2016లో రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. 2018లో మిస్‌ వరల్డ్‌ టూరిజం టైటిల్‌ గెలుచుకున్నారు. విక్రమ్‌ భట్‌ వెబ్‌ సిరీస్‌ హద్‌లో కీలక పాత్ర పోషించారు. 60 నిమిషాల్లో 60 మంది మోడళ్లకు 60 ఎయిర్‌బ్రష్‌ మేక్‌పతో గిన్నీస్‌ బుక్‌ రికార్డు సాధించారు. నటనకు గుడ్‌బై చెప్పినా.. భవిష్యత్‌లో నిర్మాతగా మారతానని ఇషికా తెలిపారు.

ఇస్కాన్‌ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం

మహా కుంభ్‌నగర్‌లోని ఇస్కాన్‌ క్యాంప్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం కలకలం రేపింది. సెక్టార్‌ 18లోని ఇస్కాన్‌ క్యాంప్‌లో మొదలైన అగ్నికీలలు పరిసరాల్లోని మరో 12 క్యాంపులకు కూడా వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కానీ ఆ క్యాంపులకు పెద్దఎత్తున నష్టం కలిగింది. మంటలు మొదలైన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి వాటిని ఆపేశారని చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ప్రమోద్‌ శర్మ తెలిపారు. మహా కుంభమేళాలో ఇది మూడో అగ్ని ప్రమాదం. గత నెల 19, 25 తేదీల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. అయితే ఆ ప్రమాదాల్లో ఎవరూ గాయపడలేదు.


ఇవి కూడా చదవండి..

AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2025 | 05:51 AM