Assam Elephants Tragedy: పెను విషాదం.. రైలు ప్రమాదంలో 8 ఏనుగులు మృతి
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:48 AM
ఏనుగుల గుంపును రైలు ఢీకొట్టిన ఘటనలో 8 ఏనుగులు ప్రాణాలు కోల్పోగా.. ఓ ఏనుగు పిల్ల తీవ్రంగా గాయపడింది. శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.
అస్సాంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఏనుగుల గుంపును రైలు ఢీకొట్టిన ఘటనలో 8 ఏనుగులు ప్రాణాలు కోల్పోగా.. ఓ ఏనుగు పిల్ల తీవ్రంగా గాయపడింది. ఈ రోజు (శనివారం) ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శనివారం తెల్లవారుజామున 2.17 గంటల సమయంలో అస్సాంలోని హొజాయ్ ప్రాంతంలో ఏనుగుల గుంపు రైలు పట్టాలు దాటుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాయిరంగ్ - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఆ పట్టాలపై వేగంగా దూసుకువచ్చింది. పట్టాలు దాటుతున్న ఏనుగుల్ని ఢీకొంది. దీంతో 8 ఏనుగులు అక్కడికక్కడే చనిపోయాయి.
ఓ ఏనుగు పిల్ల తీవ్రంగా గాయపడింది. గువహటికి 126 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏనుగులు ఢీకొట్టిన వేగానికి లోకో మోటివ్‌తో పాటు ఐదు కోచులు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఇక, సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లారు. సహాయక చర్యలు మొదలుపెట్టారు. రైలు పట్టాలు తప్పటంతో పాటు ఏనుగుల కళేబరాలు చెల్లా చెదురుగా పడిపోవటంతో ఎగువ అస్సాంతో పాటు పలు ఈశాన్య ప్రాంతాలకు సంబంధించిన రైలు సేవలు నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాకపోవటంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. పట్టాలపై ఏనుగుల్ని చూసిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశాడు. అయినా కూడా దారుణం జరిగిపోయింది. రైలు ఏనుగుల్ని ఢీకొట్టింది.
ఇవి కూడా చదవండి
ప్రాణం తీసిన అపార్టుమెంట్ వివాదం..
ఇకపై అన్ని స్కూళ్లల్లో ‘ముస్తాబు’.. సర్కార్ ఉత్తర్వులు జారీ