Bride Flees With Gold And Cash: ఫస్ట్ నైట్ రోజు వరుడికి గట్టి షాకిచ్చిన వధువు
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:43 PM
తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరుడు నీటి కోసం గదిలోంచి బయటకు వచ్చాడు. అప్పుడు అతడికి షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి కూతురు నగలు, డబ్బులతో ఇంటినుంచి పరారైన సంగతి తెలిసింది.
ఎన్నో ఆశలతో భార్యతో కొత్త జీవితం మొదలుపెట్టాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఫస్ట్ నైట్ రోజు భార్య ఆ వ్యక్తికి మతిపోగొట్టే ట్విస్ట్ ఇచ్చింది. డబ్బు, బంగారంతో ఇంటినుంచి పారిపోయింది. దీంతో ఆ వ్యక్తి కుదేలయ్యాడు. చేసేది ఏమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కిషన్‌ఘర్‌కు చెందిన ఓ వ్యక్తికి చాలా కాలం నుంచి పెళ్లి కావటం లేదు. సంబంధాలు చూసి బాగా విసిగిపోయాడు. ఇలాంటి సమయంలో జితేంద్ర అనే పెళ్లిళ్ల బ్రోకర్ అతడి జీవితంలోకి వచ్చాడు.
జైపూర్‌కు చెందిన ఓ యువతి సంబంధం తీసుకువచ్చాడు. సీన్ కట్ చేస్తే ఇద్దరీ జైపూర్‌లో ఘనంగా పెళ్లి జరిగిపోయింది. సంబంధం కుదిర్చినందుకు పెళ్లికొడుకు దగ్గరినుంచి జితేంద్ర ఏకంగా 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. తాజాగా పెళ్లికూతురు, పెళ్లి కొడుకు కిషన్‌ఘర్ వచ్చారు. అత్తగారు పెళ్లి కూతురికి తమ సంప్రదాయం ప్రకారం భారీగా నగలు బహుమతి ఇచ్చింది. అదే రోజు ఫస్ట్ నైట్ కోసం ఏర్పాటు జరిగాయి. ఇందుకు పెళ్లి కూతురు ఒప్పుకోలేదు. ‘మా సంప్రదాయం ప్రకారం శోభనం ఇప్పుడు జరగడానికి వీలు లేదు. నేను నీతో ఒకే గదిలో కలిసి కూడా పడుకోను’ అని అంది.
ఇందుకు అతడు ఒప్పుకున్నాడు. పెళ్లి కూతురు ఒంటరిగా వేరే గదిలో పడుకుంది. తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరుడు నీటి కోసం గదిలోంచి బయటకు వచ్చాడు. అప్పుడు అతడికి షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి కూతురు నగలు, డబ్బులతో ఇంటినుంచి పరారైన సంగతి తెలిసింది. ఆ ఫ్యామిలీ మొత్తం స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్, దగ్గరలోని ఏరియాల్లో వెతికింది. పెళ్లి కూతురు ఎక్కడా కనిపించలేదు. దీంతో వరుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కూతురితో పాటు జితేంద్ర కూడా కనిపించటం లేదు. దీంతో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
దసరా రోజు పాలపిట్టను చూస్తే ఏమౌతుంది?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం