Rahul Gandhi: నరేందర్.. సరెండర్
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:26 AM
రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్‌తో కాల్పుల విరమణకు ప్రధాని మోదీ ఒప్పుకున్నట్టు, ట్రంప్ బెదిరింపులకు లొంగిపోయారని విమర్శించారు. జీ7 సదస్సుకు మోదీ ఆహ్వానం రాకపోవడం పై కాంగ్రెస్ దౌత్య పరంగా విఫలమని ఘాటుగా అభిప్రాయపడ్డింది.
ట్రంప్ ఆదేశించారు.. ప్రధాని మోదీ ఆపేశారు!
పాక్‌తో కాల్పుల విరమణపై రాహుల్ విమర్శలు
కొద్దిగా ఒత్తిడి తెస్తే చాలు.. బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు లొంగిపోతారు
స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచీ అంతే..
నాడు అమెరికా బెదిరింపులకు ఇందిర
లొంగలేదు.. పాక్‌ను ముక్కలు చేశారు: రాహుల్
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌ను సమావేశపరచాలి
ప్రధానికి ఇండియా కూటమి పార్టీల లేఖ
సంతకం చేయని ఎన్‌సీపీ విడిగా లేఖ రాస్తామన్న ఆప్
భోపాల్, జూన్ 3: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మోదీ లొంగిపోయారన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాగానే మోదీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోదీజీ.. ఏం చేస్తున్నారు?అని అడిగారు. నరేందర్.. సరెండర్ అన్నారు. వెంటనే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించారు’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలపై కొద్దిపాటి ఒత్తిడి తెచ్చినా వెంటనే లొంగిపోతారని, భయంతో పారిపోతారని, వారి గురించి తనకు బాగా తెలుసని అన్నారు. అదేసమయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘అమెరికా బెదిరింపులను సైతం లెక్క చేయకుండా ఇందిరా గాంధీ హయాంలో 1971లో పాకిస్థాన్‌ను భారత్ విచ్ఛిన్నం చేసింది.
అగ్రరాజ్యాలకు తల వంచకుండా పనిచేసింది. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్.. వీరంతా అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే’’ అని రాహుల్ చెప్పారు. ఇదీ బీజేపీ, ఆరెస్సెస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు మధ్య ఉన్న తేడా అని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమ సమయం నుంచీ అంతేనని, వారికి లొంగిపోతూ లేఖలు రాయడం అలవాటని వ్యాఖ్యానించారు. కొద్దిపాటి ఒత్తిడి తెచ్చినా లొంగిపోతారని, అది వారి నైజమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ లొంగిపోదన్నారు. కాంగ్రెస్ నేతలంతా పోరాట యోధులని చెప్పారు. మరోవైపు అదానీ సంస్థలో ఎల్‌ఐసీ రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టడంపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘‘డబ్బు, పాలసీ, ప్రీమియం మీది.. భద్రత, సౌకర్యం, లబ్ధి అదానీది’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
జీ7కి ఆహ్వానం రాకపోవడం భంగపాటే
కెనడాలో జరగనున్న జీ7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం అందలేదు. దీంతో జీ7లో ప్రధాని పాల్గొనకపోవడం ఆరేళ్లలో తొలిసారి అవుతుంది. ఈ అంశంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, కెనడాతోపాటు జర్మనీ అధినేతలు జీ7 సదస్సులో పాల్గొననున్నారని, వీరితోపాటు బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా దేశాధినేతలకూ ఆహ్వానం అందిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. 2014కు ముందు జీ8గా ఉండేదని, నాటి ప్రధాని మన్మోహన్‌కు అప్పట్లో ఆహ్వానం అందేదని తెలిపారు. 2014 తర్వాత ఈ సంప్రదాయం కొనసాగినప్పటికీ.. ఆరేళ్లలో తొలిసారి మన ప్రధానికి ఆహ్వానం అందలేదన్నారు. ఎలా చూసినా.. దౌత్యపరంగా ఇదో భంగపాటేనని చెప్పారు. అయితే, జీ7 సదస్సుకు ఆహ్వానం అందినా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం లేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కెనడాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మోదీ అక్కడికి వెళ్లకపోవచ్చనే వాదన ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news