Rahul Gandhi: బీజేపీతో ఈసీ కుమ్మక్కు
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:53 AM
బిహార్ ఎన్నికలను దొంగిలించేందుకే ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్)ను చేపట్టారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శించారు.
బిహార్‌ను కాజేయడానికే ‘సర్’ కుట్ర.. ఓటర్ల తొలగింపు పథకాన్ని సాకారం కానివ్వం: రాహుల్
ససారం నుంచి ‘ఓటర్ అధికార యాత్ర’కు శ్రీకారం
ససారం, ఆగస్టు 17: బిహార్ ఎన్నికలను దొంగిలించేందుకే ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్)ను చేపట్టారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శించారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) బీజేపీతో కుమ్మక్కైందని యావద్దేశానికి తెలిసిపోయిందన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను అది దొంగిలిస్తోందని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు చేపట్టి బిహార్ ఎన్నికలను కూడా తస్కరించాలని చూస్తున్నారని.. ఈ కుట్రను ఇండీ కూటమి అనుమతించదని స్పష్టంచేశారు. రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్లో ‘ఓటర్ అధికార యాత్ర’కు ఆయన ఆదివారం ససారం నుంచి శ్రీకారం చుట్టారు. ఆ రాష్ట్రంలోని 20 జిల్లాల గుండా 16 రోజులపాటు 1,300 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. సెప్టెంబరు 1న ముగిస్తారు. ససారం సభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రెస్‌కాన్ఫరెన్స్ పెట్టి ఓట్ల చోరీని బహిర్గతం చేసినందుకే తనను ఈసీ అఫిడవిట్ అడుగుతోందన్నారు. ‘ఈసీ ఏం చేస్తోందో... ఏ విధంగా ఓట్ల చోరీకి పాల్పడుతోందో ఇప్పుడు దేశం మొత్తానికీ తెలిసిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘బిహార్, మహారాష్ట్ర, అసోం, బెంగాల్ సహా ఇక ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా మేం పట్టేస్తాం’ అన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని.. రిజర్వేషన్లపై ఉన్న 50ు పరిమితిని తొలగించాలని పార్లమెంటులో ప్రధాని ముందే చెప్పానని అన్నారు. ఒత్తిడితోనే మోదీ ప్రభుత్వం కులగణన ప్రకటన చేసిందన్నారు. వాస్తవానికి కులాల జనాభా లెక్కింపు చేపట్టరని.. అలాగే రిజర్వేషన్లపై పరిమితిని కూడా తొలగించరని స్పష్టంచేశారు. కాంగ్రెస్, ఇండీ కూటమి ఈ రెండు పనులూ చేస్తుందని హామీ ఇచ్చారు. తన యాత్రపై రాహుల్ ‘ఎక్స్’లో కూడా స్పందించారు. ‘ఓటరు అధికార యాత్ర’తో ప్రజల్లోకి వస్తున్నాం. ఒక వ్యక్తికి ఒకే ఓటు అన్న మౌలిక ప్రాథమిక హక్కును కాపాడేందుకే మా పోరాటం. రాజ్యాంగాన్ని రక్షించేందుకు బిహార్లో మాతో కలిసి నడవండి’ అని పిలుపిచ్చారు. కాగా.. భారత్ జోడో యాత్ర-2లాగే ఈ యాత్ర కూడా హైబ్రిడ్ విధానంలో జరుగుతుందని.. నడవడంతో పాటు వాహనంలోనూ ఆయన యాత్ర సాగిస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు రాజ్యాంగానికి ప్రమాదమేనని.. ప్రజల హక్కులకు రక్షణ ఉండదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సభలో అన్నారు. ఈసీ మోదీ ప్రభుత్వానికి ఏజెంటులా పనిచేస్తోందని ఆరోపించారు. వచ్చే బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు పడగొడతారని జోస్యం చెప్పారు. ఐక్య ఇండీ కూటమి.. నితీశ్‌కుమార్ సర్కారును కూల్చేస్తుందని ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ అన్నారు.
ఈసీపై చర్యలేకుండా చట్టం తెచ్చారు
ఎన్నికల కమిషన్‌పై ఎవరూ చర్య తీసుకోకుండా మోదీ ప్రభుత్వం 2023లో చట్టం తెచ్చిందని రాహుల్ ఆరోపించారు. బీజేపీకి సహకరిస్తున్నందుకు, ఓట్లు చోరీ చేస్తున్నందుకు మోదీ, అమిత్‌షా దీనిని తీసుకొచ్చారని అన్నారు. పాదయాత్ర ఔరంగాబాద్ చేరినప్పుడు ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల కమిషనర్లపై ఎవరూ కేసు పెట్టడానికి వీల్లేదు. ఇండియాలో ఏ కోర్టులోనూ కేసు పెట్టకూడదని 2023లో చట్టం తెచ్చారు. ఎన్నికల ప్రక్రియలో సీసీటీవీ ఫుటేజ్‌పై ప్రభుత్వం ఎందుకు చట్టం తెచ్చిందో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఎన్నికల కమిషనర్లు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
ఈసీకి 18 వేల అఫిడవిట్లు ఇచ్చాం
ఒక్కదాని మీద కూడా చర్యల్లేవు: అఖిలేశ్
కాన్పూర్, ఆగస్టు 17: ఓట్ల చోరీకి సంబంధించి ఎన్నికల సంఘానికి (ఈసీకి) పార్టీ పరంగా తాము ఇప్పటి వరకూ 18,000 అఫిడవిట్లను సమర్పించామని, ఒక్కదానిమీద కూడా ఈసీ చర్యలు తీసుకోలేదని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై తాము చేసిన ఫిర్యాదుల గురించికానీ, దాఖలు చేసిన అఫిడవిట్ల మీదగానీ ఈసీ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఆదివారం అఖిలేశ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఈసీపై పలు రకాల ఒత్తిళ్లు ఉంటున్నాయని మాకు తెలుసు. అయితే, ఈసీ తాను ఒంటరిని కాదని తెలుసుకోవాలి. సత్యం అనే మార్గంలో పయనించినప్పుడు ప్రజలు కూడా తోడుగా నిలుస్తారు. ఈసీ సరైన మార్గంలో పయనిస్తే కోట్లాదిమంది భారతీయులు ఆ సంస్థకు రక్షణ కవచంలా ఉంటారు’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. ఈసీలో ప్రస్తుతం కావాల్సింది సంస్కరణలు కావని, ఆ సంస్థలో పూర్తిగా ప్రక్షాళన జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ