Share News

Rahul Gandhi on Bihar Elections: బిహార్లో ఒక్క ఓటూ తస్కరించనివ్వం

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:26 AM

ఓట్ల దొంగతనంలో ఎన్నికల కమిషన్‌ ఈసీ బీజేపీ భాగస్వాములని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపించారు. ప్రత్యేక విస్తృత సవరణ..

Rahul Gandhi on Bihar Elections: బిహార్లో ఒక్క ఓటూ తస్కరించనివ్వం

  • ఓట్ల చోరీలో ఈసీ-బీజేపీ భాగస్వామ్యం

  • ‘ఓటర్‌ అధికార యాత్ర’లో రాహుల్‌

నవాడా, ఆగస్టు 19: ఓట్ల దొంగతనంలో ఎన్నికల కమిషన్‌ (ఈసీ), బీజేపీ భాగస్వాములని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపించారు. ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌) ద్వారా బిహార్లో ఒక్క ఓటును కూడా తస్కరించనివ్వబోమని స్పష్టంచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహులే ప్రధానమంత్రి అవుతారని ఆర్‌జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ అన్నారు. ‘ఓటర్‌ అధికార యాత్ర’లో మూడోరోజు మంగళవారం వారు నవాడాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. ‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఎన్నికల కమిషనర్లు ఓటు హక్కును ప్రజల నుంచి లాక్కుంటున్నారు. హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ఎన్నికలను ఇలాగే దొంగిలించారు. మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నడుమ మేజిక్‌ చేసి కోటి మంది కొత్త ఓటర్లను చేర్చారు. మెషీన్‌లో చదవగలిగే ఓటర్ల జాబితాలను మాకివ్వాలని ఈసీని మేం కోరాం. కానీ కమిషన్‌ దానితోపాటు సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వడానికీ నిరాకరించింది. ఇప్పుడు బిహార్లో కొత్త తరహాలో మీ కళ్ల ముందే ఓట్ల చోరీ చేస్తున్నారు. కానీ, బిహార్‌లో ఒక్క ఓటును కూడా దొంగిలించనివ్వం’ అని రాహుల్‌ స్పష్టంచేశారు. ఇప్పుడు మీ ఓట్లు తీసేస్తారు.. తర్వాత రేషన్‌ కార్డులు తొలగిస్తారు.. అనంతరం మీ భూములు లాక్కుంటారు.. వాటిని అదానీ, అంబానీలకు ఇస్తారని ఆరోపించారు. తప్పుడు చట్టాలు, జీఎ్‌సటీ, పెద్దనోట్ల రద్దు ఇవన్నీ వారికి మేలు చేయడానికేనని తెలిపారు. అంతకుముందు ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓ వ్యక్తిని రాహుల్‌ పిలిచి మాట్లాడించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోలింగ్‌ ఏజెంటుగా ఉన్నానని.. ఎస్‌ఐఆర్‌లో తన పేరు తొలగించారని అతడు చెప్పాడు. బిహార్లో ఇలాంటివారు లక్షల మంది ఉన్నారని.. వారి ఓట్లను జాబితాల నుంచి తొలగించారని రాహుల్‌ అన్నారు. ఇదిలా ఉండగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధానిని చేద్దామని తేజస్వి యాదవ్‌ ఈ ర్యాలీలో పిలుపిచ్చారు. ఆయన కారణంగానే ప్రధాని మోదీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు.


ఓట్లు ఉన్నా లేవని చెప్పించారు: నడ్డా

తన కుటుంబంలోని ఆరుగురు ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారంటూ యాత్రలో రాహుల్‌, తేజస్వి సమక్షంలో చెప్పిన మహిళ.. ఆ తర్వాత అదేమీ లేదని స్పష్టంచేసింది. తనకు చదువు లేదని.. తన కుటుంబ సభ్యుల ఓట్లను తీసివేసినట్లు చెప్పాలని కొందరు చెప్పడంతో.. అదే చెప్పానని.. జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయని తెలిపింది. ఆమె వీడియోను కేంద్ర మంత్రి నడ్డా ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. ‘నా అబద్ధం బయటపడినా నేను అక్కడే ఉన్నాను. వాస్తవం బహిర్గతమైంది. నేను జోకర్‌గా మారాను. అయినా అక్కడే నిలబడి ఉన్నాను’ అనే చరణాలున్న పాటను కూడా జతచేసి రాహుల్‌ను ఎద్దేవాచేశారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చెట్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకొనేందుకు నిరాకరించింది. 2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ చేతన్‌ అహిరే అనే విఖ్రోలికి చెందిన ఓటర్‌ పిటిషన్‌ వేశారు.

Updated Date - Aug 20 , 2025 | 04:26 AM