Share News

Rahul Gandhi Accuses CEC: ఓట్ల దొంగలకు సీఈసీ రక్ష

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:38 AM

కేంద్ర ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ తన దాడిని ఇంకా తీవ్రతరం చేశారు. ఈదఫా ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై...

Rahul Gandhi Accuses CEC: ఓట్ల దొంగలకు సీఈసీ రక్ష

కర్ణాటకలోని ఆళంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఆన్‌లైన్‌ ద్వారా కాంగ్రెస్‌ ఓట్ల తొలగింపు

వివరాల కోసం కర్ణాటక సీఐడీ 18 నెలల్లో 18 లేఖలు రాసినా ఈసీ సమాచారం ఇవ్వలేదు: రాహుల్‌ గాంధీ

త్వరలో ‘మాస్టర్‌మైండ్‌’ను బయటపెడతానని వెల్లడి

ఆన్‌లైన్లో ఎవరూ ఓట్లు తొలగించలేరు: ఈసీ

న్యూఢిల్లీ/బెంగళూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ తన దాడిని ఇంకా తీవ్రతరం చేశారు. ఈదఫా ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై నేరుగా దాడికి దిగారు. ఓట్ల దొంగలకు ఆయన అండగా ఉన్నారని.. ప్రజాస్వామ్య వినాశకులను కాపాడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని ఆళంద అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ ఓటర్లను టార్గెట్‌ చేశారని.. తమ పార్టీ అనుకూల పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓటర్లను ఆన్‌లైన్లో తొలగించారని చెప్పారు. రాహుల్‌ గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆళంద నియోజకవర్గంలో తమ పార్టీ ఓటర్లను తొలగించే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు కోసం ఆ రాష్ట్ర సీఐడీ కోరిన సమాచారం వారంలోగా ఇవ్వాలని అల్టిమేటం ఇచ్చా రు. లేకపోతే రాజ్యాంగం హత్యలో సీఈసీ కూడా భాగస్వామి అయినట్లేనని స్పష్టంచేశారు. కొందరు దేశవ్యాప్తంగా ఓ పద్ధతి ప్రకారం లక్షల కొద్దీ ఓటర్లను తొలగిస్తున్నారని తెలిపారు. ఓ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఇది చేస్తున్నారని.. దీనిపై కర్ణాటకలో దర్యాప్తు జరుగుతోందన్నారు. ‘ఎక్కడి నుంచి ఓట్ల తొలగింపు దరఖాస్తులు వచ్చాయో డెస్టినేషన్‌ ఐపీ, ఓటీపీ వివరాలను చెప్పాలని కర్ణాటక సీఐడీ 18 నెలల్లో ఈసీకి 18 లేఖలు రాసింది. కానీ ఈ ఆపరేషన్‌తో అంతా బయటపడుతుందని కమిషన్‌ ఆ వివరాలు ఇవ్వడం లేదు. ఇదంతా ఎవరు చేస్తున్నారో దానికి తెలుసు.


అలాగే ఆటోమేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మహారాష్ట్ర రాజురా అసెంబ్లీ స్థానంలో అదనపు ఓట్లు నమోదుచేశారు. ఆ వ్యవస్థనే అంతటా ఉపయోగిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో వాడుతున్నారు. హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో వాడారు. అందుకు మా వద్ద ఆధారాలున్నాయి. దేశంలో ప్రతి యువకుడూ ఇది తెలుసుకోవాలి. మీ భవిష్యత్‌తో వారేం చేస్తున్నారో తెలియాలి. ఓట్ల చోరీపై మా పరిశోధన, ప్రజెంటేషన్లు ఇవ్వడానికి రెండు, మూడు నెలలు పడుతుంది. ఇవన్నీ పూర్తయ్యాక ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రాన్ని, లోక్‌సభ ఎన్నికలను తస్కరించారని నిస్సందేహంగా మీకే అర్థమవుతుంది. సత్యాన్ని అన్వేషించి ప్రజలకు చూపించడమే నా కర్తవ్యం’ అని వివరించారు.

పథకం ప్రకారమే ఆపరేషన్‌

ఆళందలో కాంగ్రెస్‌ పటిష్ఠంగా ఉన్న పది పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్ల తొలగింపులు జరిగాయని రాహుల్‌ చెప్పారు. ‘2018లో ఈ పదింటిలో 8 చోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. ఓట్లు తీసేయడం కాకతాళీయం కాదు. పథకం ప్రకారం జరిగిన ఆపరేషన్‌. ఈరోజు నేను చెబుతున్న వివరాలు.. ఎన్నికలను ఎలా రిగ్గింగ్‌ చేస్తున్నారో ఈ దేశ యువతకు చాటే క్రమంలో మరో మైలురాయి. జ్ఞానేశ్‌కుమార్‌ గురించి తీవ్రమైన అంశం చెబుతున్నాను. సీఈసీ ఓట్ల దొంగలను కాపాడుతున్నారు. నేను ప్రతిపక్ష నేతను. ఆషామాషీగా చెప్పడం లేదు. వంద శాతం రుజువులు లేకుండా ఏదీ చెప్పను. జ్ఞానేశ్‌కుమార్‌.. మీ విధి మీరు విధించాలన్నదే మా డిమాండ్‌. మీరు భారత సీఈసీ. కర్ణాటక సీఐడీకి సాక్ష్యాధారాలు అందించాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఈసీ వర్గాల నుంచీ మాకు సమాచారం..

ఎన్నికల కమిషన్‌ అంతర్గత వర్గాల నుంచి కూడా తమకు సమాచారం, సహకారం అందుతోందని రాహుల్‌ చెప్పారు. అయితే ఈ నిజాలు తాను చెప్పిన హైడ్రోజన్‌ బాంబు కాదని.. ఆ బాంబులాంటి వివరాలను త్వరలోనే బయటపెడతానని తెలిపారు. దీనివెనుక మాస్టర్‌మైండ్‌ ఎవరని విలేకరులు ప్రశ్నించగా.. అది కూడా ప్రజల ముందుంచుతానని.. ఈ వాస్తవాల హైడ్రోజన్‌ బాంబు బహిర్గతం చేశాక సర్వం వెల్లడవుతుందని రాహుల్‌ బదులిచ్చారు.


ఆన్‌లైన్లో ఓటు తొలగించలేరు: ఈసీ

న్యూఢిల్లీ: ఆన్‌లైన్లో ఓట్లు తొలగించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఎవరూ ఇలా తొలగించలేరని, జ్ఞానేశ్‌కుమార్‌పై ఆయన వ్యాఖ్యలు అవాస్తవం.. నిరాధారమని తేల్చిచెప్పింది. వాదన వినిపించుకునే అవకాశం బాధిత వ్యక్తి ఇవ్వకుండా.. ఓటు తొలగించే అవకాశం ఉండదని పేర్కొంది.

అలజడి సృష్టికే ఆరోపణలు: బీజేపీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై రాహుల్‌గాంధీ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. చొరబాటుదారులే ఆయనకు పెద్దపీట వేస్తారని.. దేశంలో అలజడి, గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్‌పై ఆయన పదే పదే చేస్తున్న ఆరోపణలు.. ప్రజాస్వామ్యంపై ఆయనకు విశ్వాసం లేదని చాటుతున్నాయి. నేపాల్‌, బంగ్లాదేశ్‌లలో మాదిరిగా భారత్‌లోనూ అలజడి, సంక్షోభం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. చొరబాటుదార్లకే అగ్ర స్థానమనే రాజకీయాలే ఆయన ఏకైక ఎజెండా’ అని దుయ్యబట్టారు. ఆళందలో ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు వచ్చిన ఐపీ అడ్ర్‌సలు, మొబైల్‌ ఫోన్ల సమాచారాన్ని కమిషన్‌ సీఐడీకి అందజేసిందని.. కానీ పోలీసులు చర్యలూ తీసుకోలేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 06:38 AM