Rahul Gandhi: బిహార్లోనూ ఎన్నికల హైజాక్!
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:52 AM
మహారాష్ట్రలో మాదిరిగా బిహార్లోనూ ఎన్నికల హైజాక్‌కు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపించారు.
బీజేపీ కోసమే ఈసీ పనిచేస్తోంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజాన్ని తొలగించే కుట్ర: ఖర్గే
భువనేశ్వర్, జూలై 11: మహారాష్ట్రలో మాదిరిగా బిహార్లోనూ ఎన్నికల హైజాక్‌కు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) తన విధులు తాను నిర్వర్తించకుండా.. అధికార పార్టీ కోసమే పనిచేస్తోందన్నారు. శుక్రవారం ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ‘సంవిధాన్ బచావో సమావేశ్’లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది చివరిలో జరిగే బిహార్ ఎన్నికలను హైజాక్ చేయకుండా బీజేపీని అడ్డుకోవాలని ఇండి యా కూటమి పార్టీలు నిర్ణయించాయని తెలిపారు. ఆ పార్టీ దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై దాడిచేస్తోందన్నారు. ‘బీజేపీ తన ప్రభుత్వాన్ని ఐదారుగురు పారిశ్రామికవేత్తల కోసమే నడుపుతోంది. సాధారణ ప్రజల కోసం అది పనిచేయదు. నీరు, అడవులు, భూములు గిరిజనులకు చెందినవి. ఒడిసాలోని బీజేపీ ప్రభుత్వం షెడ్యూల్ ఏరియాలను విస్తరించే పంచాయతీల చట్టాన్ని అమలు చేయడం లేదు.
అటవీ హక్కుల పట్టాలను గిరిజనులకు అందజేయడం లేదు. మేమొస్తే పెసా, గిరిజనుల చట్టాలను అమలు చేస్తాం. గిరిజనులకు వారి భూములను వారికి అప్పగిస్తాం. గతంలో ఒడిసా రాష్ట్రాన్ని బీజేడీ సర్కారు దోచుకుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ పనిచేస్తోంది’ అని ఆయన విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాషాయ పార్టీ.. రాజ్యాంగాన్ని మార్చాలని పనిగా పెట్టుకుందని.. రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజాన్ని తొలగించేందుకు ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఏలుబడిలో గిరిజనులు, దళితులు, మహిళలు, యువత సురక్షితంగా లేరన్నారు. పేదలను, గిరిజనులకు కాపాడేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీ ఏ ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల చట్టం తెచ్చిందని, అయితే మోదీ సర్కారు దానిని అమలు చేయడం లేదని ఆక్షేపించారు. పరిశ్రమల పేరిట ప్రతి చోటా అడవులను నాశనం చేస్తోందన్నారు. కాంగ్రెస్ దేశంలో 160 ప్రభుత్వ రంగ సంస్థ(పీఎ్‌సయూ)లను ఏర్పాటుచేస్తే.. వాటిలో 23 సంస్థలను బీజేపీ ప్రైవేటీకరించిందన్నారు. కాంగ్రెస్ సృష్టించిన ప్రజాసంపదను తన మిత్రులకు మోదీ అమ్మేస్తున్నారని ఖర్గే ఆరోపించారు.