Rahul Gandhi Accuses BJP: ఓటు చోరీకి ఆయుధంగా ఎస్‌ఐఆర్
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:10 AM
బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ ఎస్‌ఐఆర్ అనేది ఓట్లను దొంగిలించేందుకు వాడుతున్న ఆయుధమని కాంగ్రెస్ అగ్రనేత ..
బీజేపీ, ఈసీ కలిసి బడుగు వర్గాల ఓట్లను దొంగిలిస్తున్నాయి
వారి ఉనికి లేకుండా చేస్తున్నాయి
‘ఓటు చోరీ’పై పోరాటం సాగిస్తాం
‘ఒక వ్యక్తి.. ఒక ఓటు’ను కాపాడతాం: రాహుల్ గాంధీ
బిహార్‌లో రెండోరోజు ఓటరు అధికార యాత్రలో రాహుల్
ఔరంగాబాద్/గయా జీ, ఆగస్టు 18: బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) అనేది ఓట్లను దొంగిలించేందుకు వాడుతున్న ఆయుధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఓట్ల చోరీని అడ్డుకొని ‘ఒక వ్యక్తి.. ఒక ఓటు’ను పరిరక్షించేందుకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసి.. ప్రస్తుత ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటుహక్కును కోల్పోయిన పలువురితో తాను మాట్లాడిన వీడియోను రాహుల్ తన వాట్సాప్ చానల్‌లో పోస్ట్ చేశారు. బిహార్‌లోని ససారాం నుంచి చేపట్టిన ఓటరు అధికార యాత్ర ప్రారంభం సందర్భంగా వారితో రాహుల్ మాట్లాడారు. దేశంలో ఓటు చోరీ జరుగుతోందని చెప్పడానికి వీడియోలో తన పక్కన నిలబడ్డవారే సజీవ సాక్ష్యమన్నారు. వారంతా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారని, కానీ.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి వారి గుర్తింపు, ఉనికి కూడా లేకుండా భారత ప్రజాస్వామ్యం నుంచే తొలగింపునకు గురయ్యాయని తెలిపారు. వారి పేర్లను రాహుల్ వెల్లడించారు. వారిలో మాజీ సైనికుడు, రైతు అయిన రాజ్‌మోహన్ సింగ్(70) కూడా ఉన్నారని తెలిపారు. ఓట్ల తొలగింపులో ఈసీ మాజీ సైనికులను వారు వదిలిపెట్టలేదని మండిపడ్డారు. అనంతరం ఔరంగాబాద్‌లో మరికొందరు బాధితులను కలుసుకున్న వీడియోను రాహుల్‌గాంధీ పోస్ట్ చేశారు. ‘‘గత నాలుగైదు ఎన్నికల్లో ఓటు వేసినవారి ఓటుహక్కును కూడా దొంగిలించారు. కారణం అడిగితే.. పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు’’ అని రాహుల్ తెలిపారు. ఏదో ఒకరోజు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, ఓటు చోరీకి పాల్పడ్డందుకు సీఈసీపై, ఇద్దరు ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసీ నేరాన్ని బయట పెట్టిన తనను అఫిడవిట్ అడుగుతున్నారని, కానీ.. దేశం మొత్తం వారినే అఫిడవిట్ అడిగే పరిస్థితి వస్తుందని అన్నారు. తమకు కొద్దిగా సమయమిస్తే.. ప్రతి అసెంబ్లీ స్థానం, లోక్‌సభ స్థానంలో ఓట్ల చోరీని బయటపెడతామని చెప్పారు. కాగా, ఓట్లు తొలగించామంటూ రాహుల్‌వీడియోలో పేర్కొన్న వక్తుల వివరాలను తమకు అందజేయాలని ఈసీ కోరింది.