Teen Thrown Into Canal: కూతురి చేతులు కట్టేసి కాల్వలో పడేసిన తండ్రి.. ఈ ట్విస్ట్ మామూలుగా లేదు..
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:34 PM
పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురిపై అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆమె చేతులు కట్టేసి పెద్ద కాల్వలో పడేశాడు. ఆ యువతి కాల్వలో కొట్టుకుపోయింది. అయితే, 2 నెలల తర్వాత ఎవ్వరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
పంజాబ్ రాష్ట్రంలో మతి పోగొట్టే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ యువతిని ఆమె తండ్రి చేతులు కట్టేసి కాల్వలో పడేశాడు. ఆ యువతి నీటిలో కొట్టుకుపోయింది. కూతుర్ని చంపిన కేసులో ఆ తండ్రికి జైలు శిక్ష పడింది. అయితే, కొన్ని నెలల తర్వాత ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఆ యువతి ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చింది. తనను చంపాలనుకున్న తండ్రికి అండగా నిలిచింది. అతడ్ని జైలు నుంచి బయటకు తీసుకురావటానికి పోరాటం చేస్తోంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫిరోజెపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సర్జిత్ సింగ్‌కు నలుగురు కూతుర్లు ఉన్నారు. సర్జిత్‌కు పెద్ద కూతురి ప్రవర్తన నచ్చలేదు. ఆమెపై అనుమానం వచ్చింది. ఆమె తప్పుడుపనులు చేస్తోందని అతడు అనుకున్నాడు. సెప్టెంబర్ 29వ తేదీన తల్లి, ముగ్గురు చెల్లెళ్ల ముందు ఆమెపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. తర్వాత ఆమె చేతులు కట్టేసి ఊరు బయట ఉన్న పెద్ద కాల్వ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమెను ఆ కాల్వలో పడేశాడు.
ఆ యువతి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీన్నంతా అతడే స్వయంగా వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సర్జిత్ జైల్లో ఉన్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా రెండు నెలల తర్వాత ఆ యువతి ఇంటికి తిరిగి వచ్చింది. అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
‘మా నాన్న నా చేతులు కట్టేసి కాల్వలో పడేశాడు. నీటిలో పడిన తర్వాత నా చేతులకు కట్టిన తాడు ఊడిపోయింది. కొంతమంది వ్యక్తుల సాయంతో నేను కాల్వనుంచి ప్రాణాలతో బయటపడ్డాను. నా ముగ్గురు చెల్లెళ్లను చూసుకోవడానికి మా నాన్న తప్ప ఎవ్వరూ లేరు. ప్లీజ్ మాన్నను వదిలేయండి. నాకు మా బంధువుల మీద నమ్మకం లేదు. నాకు పోలీసుల ప్రొటెక్షన్ కావాలి’ అని కోరింది. అయితే, రెండు నెలల పాటు ఆమె ఎక్కడ ఉందో మాత్రం చెప్పలేదు. పోలీసులు మర్డర్ కేసును అటెంప్ట్ టు మర్డర్ కేసుగా మార్చే పనిలో పడ్డారు.
ఇవి కూడా చదవండి
సొంత ఇలాకాలో జగన్‌కు గట్టి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై హరీష్ రావు సంచలన కామెంట్స్