Pune Assasination Case: దృశ్యం సినిమా స్పూర్తి.. భార్యను చంపి మాస్టర్ ప్లాన్ వేసిన భర్త..
ABN , Publish Date - Nov 10 , 2025 | 08:03 AM
అజయ్ దేవ్‌గణ్ నటించిన దృశ్యం సినిమాను నాలుగు సార్లు చూసి ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. హత్య కేసునుంచి తప్పించుకోవటానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. చివరకు ఓవర్ యాక్టింగ్ కారణంగా అడ్డంగా దొరికిపోయాడు.
దృశ్యం సినిమా స్పూర్తితో ఓ వ్యక్తి తన భార్యను మర్డర్ చేశాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి సినిమాను తలపించేలా యాక్టింగ్ చేశాడు. తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ప్రచారం కూడా చేశాడు. చివరకు ఓవర్ యాక్టింగ్ కారణంగా అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణెకు చెందిన సమీర్ జాదవ్ అనే వ్యక్తికి అంజలితో 2017లో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమీర్ ఓ గ్యారేజ్ నిర్వహిస్తున్నాడు. అంజలి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది.
భార్యాభర్తలిద్దరూ పిల్లలతో కలిసి పుణెలోని శివానే ఏరియాలో ఉంటున్నారు. అక్టోబర్ 26వ తేదీన సమీర్ తన భార్యను కొత్తగా అద్దెకు తీసుకున్న వేర్ హౌస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతు నులిమి చంపేశాడు. తర్వాత శవాన్ని ఇనుప డబ్బాలో వేసి కాల్చి బూడిద చేశాడు. బూడిదను నదిలో పాడేశాడు. మర్డర్ కేసును తప్పుదోవ పట్టించేలా మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆమెకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందని నమ్మించేలా అంజలి ఫోన్‌నుంచి ఆమె మగ స్నేహితుడికి ‘ఐ లవ్ యూ’ అని మెసేజ్ పెట్టాడు. అతడితో కొద్దిసేపు చాట్ చేశాడు. తర్వాత భార్య కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. తరచుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధపడుతున్నట్లు ఓవర్ యాక్టింగ్ చేసేవాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. భార్య మర్డర్ గురించి బయటపెట్టాడు. పోలీసులు మొదట అంజలికి వేరే వ్యక్తితో ఎఫైర్ ఉండి ఉంటుందని, అందుకే సమీర్ చంపేసి ఉంటాడని అనుకున్నారు. కానీ, సమీరే వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని తేలింది. అజయ్ దేవ్‌గణ్ నటించిన దృశ్యం సినిమాను నాలుగు సార్లు చూసి ఈ హత్య చేసినట్లు విచారణలో సమీర్ ఒప్పుకున్నాడు.
ఇవి కూడా చదవండి
శీతాకాలంలో వాకింగ్ చేసేవారు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.!
ఒక్కొక్కరికి రెండు వేల డాలర్లు.. కీలక ప్రకటన చేసిన ట్రంప్..