EC Vs Rahul : సంబంధిత పత్రాలు ఇవ్వండి : కర్ణాటక ఓటర్ల మోసం ఆరోపణపై రాహుల్ గాంధీకి ఈసీ నోటీసు
ABN , Publish Date - Aug 10 , 2025 | 06:57 PM
'దయచేసి సంబంధిత పత్రాలను అందించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.. దాని ఆధారంగా శకున్ రాణి లేదా మరెవరైనా రెండుసార్లు ఓటు వేశారా లేదా అనే దానిపై వివరణాత్మక విచారణ నిర్వహిస్తాము' అని ఈసీ తన నోటీసులో రాహుల్ గాంధీని కోరింది.
ఇంటర్నెట్ డెస్క్ : ఎన్నికల సంఘం వర్సెస్ రాహుల్ గాంధీ వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి (CEO).. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు. కర్ణాటకలో గత ఏడాది (2024) లోక్‌సభ ఎన్నికల్లో ఒక ఓటరు రెండుసార్లు ఓటు వేశారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సంబంధించి ఈసీ ఈ నోటీసు జారీ చేశారు. ఆరోపణకు మద్దతుగా సంబంధిత పత్రాలు, ఆధారాలను సమర్పించాలని రాహుల్‌ను ఈసీ తన నోటీసులో కోరింది.
సదరు లేఖలో ఈసీ.. రాహుల్ గాంధీ ఇటీవలి విలేకరుల సమావేశాన్ని ప్రస్తావించారు. ఆ ప్రెస్ మీట్ లో రాహుల్ తన ప్రజెంటేషన్‌లోని కొన్ని పత్రాలు 'EC డేటా' అని పేర్కొన్నారు. ఓటరు శకున్ రాణి 'పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ఆధారంగా' రెండుసార్లు ఓటు వేశారని రాహుల్ ఆరోపించారు. ఒక ఓటర్ IDని రెండుసార్లు ఓటు వేయడానికి ఉపయోగించారు.. టిక్ మార్కులను పోలింగ్ బూత్ అధికారి పెట్టారు. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే, ఒక విచారణలో శకున్ రాణి తాను ఒక్కసారి మాత్రమే ఓటు వేశానని చెప్పిందని ఎన్నికల సంఘం పేర్కొంది. రాహుల్ గాంధీ చూపించిన టిక్ మార్క్ ఉన్న పత్రాన్ని పోలింగ్ అధికారి జారీ చేయలేదని, ఇది రాహుల్ వాదనకు విరుద్ధంగా ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈసీ తెలిపింది.
అందుకే.. 'దయచేసి సంబంధిత పత్రాలను అందించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దాని ఆధారంగా శకున్ రాణి లేదా మరెవరైనా రెండుసార్లు ఓటు వేశారా లేదా అనే దానిపై వివరణాత్మక విచారణ నిర్వహిస్తాము' అని ఈసీ తన లేఖలో రాహుల్ గాంధీని కోరింది. రాహుల్ గాంధీ ఈ నోటీసుకు స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను గౌరవిస్తుందని.. అవసరమైన పత్రాలను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
