EC to Rahul Gandhi: ప్రమాణ పత్రమైనా ఇవ్వండి క్షమాపణలైనా చెప్పండి
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:12 AM
ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్
ఓట్ల చోరీ ఆరోపణలపైరాహుల్‌కు మరోసారి ఈసీ డిమాండ్
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ఈసీ) మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ‘‘ఇంకా సమయం ఉంది. ఓట్ల చోరీ జరిగిందన్న ఆరోపణలను రుజువు చూపిస్తూ ప్రామాణిక డిక్లరేషన్‌పై సంతకం చేసి సమర్పించండి. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పండి’’ అని డిమాండు చేసింది. కర్ణాటక, హరియాణా ప్రధాన ఎన్నికల అధికారులు రాహుల్ గాంధీకి నోటీసులు పంపించిన నేపథ్యంలో ఈసీ తన వాదనను పునరుద్ఘాటించింది. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ విలేకరులకు చూపించిన పత్రాల్లో శకున్ రాణి అనే మహిళ రెండు సార్లు ఓటు వేసినట్టు ఉంది. తాము దర్యాప్తు జరపగా తాను రెండు సార్లు ఓటు వేయలేదని ఆమె చెప్పిందని, ఆమె ఓటు వేసినట్టు రెండు చోట్ల ఉన్న పత్రాల్లో టిక్ ఉండడం కూడా వాస్తవం కాదని కర్ణాటక ఎన్నికల అధికారి చెప్పారు. ఇదిలా ఉండగా, బిహార్‌లో ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలపై ఇంతవరకు ఏ పార్టీ కూడా విజ్ఞప్తులు సమర్పించలేదని ఈసీ తెలిపింది. పేర్లు చేర్చాలనిగానీ, తొలగించాలనిగానీ కోరుతూ ఎలాంటి దరఖాస్తులు ఇవ్వలేదని పేర్కొంది.