PM Modi: 103 రైల్వేస్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ABN , Publish Date - May 21 , 2025 | 06:56 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురవారం పునరాభివృద్ధి చేసిన 103 రైల్వేస్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రైల్వేస్టేషన్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత దేశం అనేక రంగాలలో అభివృద్ధితో ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తూ దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైల్వే వ్యవస్థలో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టి కారణంగా.. గత 11 ఏళ్లలో చోటు చేసుకున్న అభివృద్ధి, భవిష్యత్ అవసరాలు లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయించారు. ఇది 2014-15 నాటి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్ తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ.
రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు
రైల్వేలలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటి రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1300 కు పైగా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు, 2023లో ప్రారంభించారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఆయా రైల్వేస్టేషన్లను సిద్ధం చేయనున్నారు. ఇందులో తెలంగాణలోనూ 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ.2,750 కోట్లతో పునరాభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయి.
103 రైల్వేస్టేషన్లను ప్రారంభించనున్న మోదీ
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న 103 రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం (22 మే, 2025 నాడు) వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. ఇందులో బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుండటం విశేషం. బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.
పునరాభివృద్ధి పనులు జరుగుతున్న అన్ని రైల్వేస్టేషన్లలో ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముఖద్వారం, స్టేషన్ ప్రధాన భవనాల నిర్మాణం సాగుతోంది. అంతేకాకుండా స్టేషన్ లోపల ప్రయాణికులకు అనువుగా ఫుట్‌పాత్‌లు, విశాలమైన ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ ఆఫీస్, టాయిలెట్ల నిర్మాణం, సైనేజ్ బోర్డుల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో అమృత్ భారత్ రైల్వేస్టేషన్లు - వాటి పునరాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ వివరాలు:
రైల్వేస్టేషన్ పేరు - బడ్జెట్
1. ఆదిలాబాద్ - రూ. 17.76 కోట్లు
2. బాసర - రూ. 11.33 కోట్లు
3. బేగంపేట - రూ. 22.57 కోట్లు
4. భద్రాచలం రోడ్డు - రూ. 25.41 కోట్లు
5. గద్వాల - రూ. 34.29 కోట్లు
6. హఫీజ్ పేట - రూ. 29.2 కోట్లు
7. హైటెక్ సిటీ - రూ. 25.93 కోట్లు
8. ఉప్పుగూడ - రూ. 26.81 కోట్లు
9. హైదరాబాద్ - రూ. 327.27 కోట్లు
10. జనగామ - రూ. 24.45 కోట్లు
11. జడ్చర్ల - రూ. 35.54 కోట్లు
12. కాచిగూడ - రూ. 424.29 కోట్లు
13. కామారెడ్డి - రూ. 39.84 కోట్లు
14. కరీంనగర్ - రూ. 25.89 కోట్లు
15. కాజీపేట్ - రూ. 24.45 కోట్లు
16. ఖమ్మం - రూ. 25.41 కోట్లు
17. లింగంపల్లి - రూ. 310.38 కోట్లు
18. మధిర - రూ. 25.41 కోట్లు
19. మహబూబాబాద్ - రూ. 26.49 కోట్లు
20. మహబూబ్ నగర్ - రూ. 39.82 కోట్లు
21. మలక్ పేట - రూ. 36.44 కోట్లు
22. మల్కాజ్ గిరి - రూ. 27.61 కోట్లు
23. మంచిర్యాల - రూ. 26.49 కోట్లు
24. మెదక్ - రూ. 15.32 కోట్లు
25. మేడ్చల్ - రూ. 32.11 కోట్లు
26. మిర్యాలగూడ - రూ. 9.50 కోట్లు
27. నల్గొండ - రూ. 9.50 కోట్లు
28. నిజామాబాద్ - రూ. 53.03 కోట్లు
29. పెద్దపల్లి - రూ. 26.49 కోట్లు
30. రామగుండం - రూ. 26.49 కోట్లు
31. సికింద్రాబాద్ - రూ. 699.77 కోట్లు
32. షాద్ నగర్ - రూ. 32.99 కోట్లు
33. శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ - రూ. 6.07 కోట్లు
34. తాండూరు - రూ. 24.35 కోట్లు
35. ఉందానగర్ - రూ. 12.37 కోట్లు
36. వికారాబాద్ - రూ. 24.25 కోట్లు
37. వరంగల్ - రూ. 25.41 కోట్లు
38. యాదాద్రి - రూ. 24.45 కోట్లు
39. యాకుత్ పుర - రూ. 8.53 కోట్లు
40. జహీరాబాద్ - రూ. 24.35 కోట్లు