Parliament Winter Session 2025: బాధ నుంచి బయటకు రండి: ప్రతిపక్షాలకు ప్రధాని కీలక సూచన
ABN , Publish Date - Dec 01 , 2025 | 10:37 AM
బిహార్ ఓటమి నుంచి ఇంకా బయటకు రాలేదంటూ ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటించారు. ఓటమి బాధ నుంచి బయటకు రావాలంటూ ఇండి కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఆయన సూచించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 01: బిహార్ ఓటమి నుంచి ఇంకా బయటకు రాలేదంటూ ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటించారు. ఓటమి బాధ నుంచి బయటకు రావాలంటూ ఇండి కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఆయన సూచించారు. మీ బాధ్యతను మీరు నిర్వర్తించండంటూ ఆయా పార్టీలకు ప్రధాని హితవు పలికారు. పార్లమెంటులో బలమైన అంశాలతోపాటు ప్రశ్నలు లేవనెత్తండంటూ వారికి కీలక సూచన చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం అంటే ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలకు ముందు సభ్యులను ఉద్దేశించి పార్లమెంట్ ఎదుట ప్రధాని మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రధాన లక్ష్యం దేశాభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి అని వివరించారు. అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని తాను ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇవి ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతాయి. సెలవు రోజులు మినహా మొత్తం 15 రోజులపాటు ఈ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందనున్నాయి.
ఆదివారం అఖిలపక్షం..
ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆటంకాలు సృష్టించ వద్దని విపక్షాలను కోరామన్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీలో విపక్షాల డిమాండ్లు విన్నారేగానీ ఏమాత్రం స్పందించలేదని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు.
ఈ అఖిల పక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్‌రామ్ మేఘవాల్, ఎల్.మురుగన్, అనుప్రియ పటేల్‌తోపాటు జైరామ్ రమేశ్ (కాంగ్రెస్), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టీడీపీ), మిథున్‌రెడ్డి (వైసీపీ), సురేశ్‌రెడ్డి (బీఆర్‌ఎస్), బాలశౌరి (జనసేన) సహా 36 పార్టీల నుంచి దాదాపు 50మంది నేతలు పాల్గొన్నారు. కృష్ణా జలాల వినియోగం, కేటాయింపులపై పార్లమెంట్‌లో చర్చించాలని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశాన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Parliament Winter Session Begin: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. లైవ్‌లో వీక్షించండి
Weather Alert: తమిళనాట భారీ వర్షాలు.. ఆరుగురి మృతి