Weather Alert: తమిళనాట భారీ వర్షాలు.. ఆరుగురి మృతి
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:42 AM
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడులోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఆరుగురి మృతి.. నీట మునిగిన రామేశ్వరం రైల్వే స్టేషన్
చెన్నై, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడులోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తంజావూరు, తిరువారూర్, మైలాడుదురై, నాగపట్టణం తదితర డెల్టా జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తుండడంతో వేలాది ఎకరాల పంట నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలబారిన పడి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆరుగురు మృతి చెందారు. రామనాథపురం జిల్లా రామేశ్వరంలో శని, ఆదివారాల్లో అతి భారీ వర్షం కురిసింది. రామేశ్వరం రైల్వే స్టేషన్ నీట మునిగింది. రైల్వే ప్లాట్‌ఫారాలపైకి వర్షపునీరు చొచ్చుకువచ్చింది. వందలాది గృహాలు వరదనీటిలో తేలియాడుతున్నాయి. తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం, మైలాడుదురై జిల్లాల్లో 100కుపైగా గృహాలు కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా తంజావూరుతో సహా నాలుగు జిల్లాలకు చెందిన జాలర్లు వారం రోజులుగా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లలేదు. దీంతో 60 వేలకుపైగా జాలర్లు ఉపాధిని కోల్పోయారు. కన్యాకుమారిలో సముద్రపు నీరు వందడుగుల మేర వెనక్కి వెళ్లింది. దీంతో సముద్రగర్భంలోని పెద్దపెద్ద రాళ్లు బయటపడ్డాయి. ఇక దిత్వా తుఫాను కారణంగా చెన్నై, కడలూరు, పుదుచ్చేరిలలో సముద్రం ఆదివారం అల్లకల్లోలంగా మారింది. కడలూరు, పుదుచ్చేరిలో లోతట్టు మత్స్యకార గ్రామాల్లోకి సముద్రపు చొచ్చుకువచ్చింది. దీంతో జాలర్లను సురక్షిత ప్రాంతాలతో పాటు తుఫాను సహాయక కేంద్రాలకు తరలించారు. ఎన్నూరు హార్బరులో రాక్షస అలలు ఆరు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. మరోవైపు మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లలోకి ఆదివారం పర్యాటకులను అనుమతించలేదు. కడపటి వార్తలు అందేసరికి చెన్నై నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను కేంద్రీకృతమైవున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను చెన్నై మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించి రాగల 24 గంటల్లో తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.