Share News

Escape as Helicopter Lands: రాష్ట్రపతికి త్రుటిలో తప్పిన ముప్పు

ABN , Publish Date - Oct 23 , 2025 | 04:41 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం ముర్ము తిరువనంతపురం చేరుకున్నారు.

Escape as Helicopter Lands: రాష్ట్రపతికి త్రుటిలో తప్పిన ముప్పు

  • హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతుండగా కుంగిన కాంక్రీట్‌ ఇరుక్కుపోయిన హెలికాప్టర్‌ చక్రం

  • సురక్షితంగా రాష్ట్రపతిని కిందికి దించిన భద్రతా సిబ్బంది

  • కేరళలోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో ఘటన

  • హెలీప్యాడ్‌ను చివరి నిమిషంలో మార్చడం వల్లే..!

  • ఇరుముడితో అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి

  • శబరిమలలో రాష్ట్రపతి; కుంగిన హెలికాప్టర్‌ను పక్కకు తోస్తున్న సిబ్బంది

పథనంథిట్ట, అక్టోబరు 22: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం ముర్ము తిరువనంతపురం చేరుకున్నారు. బుధవారం ఉదయం ఆమె శబరిమల బయల్దేరారు. ప్రమదంలోని రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో రాష్ట్రపతి హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతుండగా.. హెలీప్యాడ్‌లోని కాంక్రీట్‌ ఒక్కసారిగా కుంగిపోయింది. హెలికాప్టర్‌ చక్రం ఒకటి లోపలికి దిగిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్‌ నుంచి కిందకు దించారు. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబకు బయల్దేరారు. హెలికాప్టర్‌ చక్రాన్ని బయటకు తీసేందుకు పలువురు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దాన్ని తోస్తున్న చిత్రాలు పలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. వాస్తవానికి రాష్ట్రపతి హెలికాప్టర్‌ పంబ సమీపంలోని నీలక్కల్‌ వద్ద దిగాల్సి ఉంది. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్‌ స్థలాన్ని ప్రమదం ప్రాంతానికి మార్చారు. ‘‘ప్రమదం ప్రాంతంలో హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేయాలని చివరి నిమిషంలో నిర్ణయించారు. అందువల్ల మంగళవారం రాత్రే ఇక్కడ హెలీప్యాడ్‌ను నిర్మించారు. దీంతో కాంక్రీట్‌ పూర్తిగా గట్టిపడలేదు. బుధవారం ఉదయం హెలికాప్టర్‌ దిగిన తర్వాత ఆ బరువును మోయలేక అది కుంగిపోయింది. చక్రం ఒకటి కాంక్రీట్‌లో ఇరుక్కుపోయింది’’ అని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

పూర్తిగా భద్రతా వైఫల్యమే

రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పడంపై కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్‌ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి భద్రత విషయంలో కేరళ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందనేదానికి ఇదే నిదర్శనమన్నారు. భద్రతా వైఫల్యంపై దర్యాప్తు జరపాలన్నారు. అయ్యప్ప దయ వల్ల రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.


  • ఇరుముడితో

  • శబరిమలకు ముర్ము

రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక కాన్వాయ్‌లో ఉదయం 11 గంటలకు పంబ చేరుకున్నారు. అక్కడి నదిలో కాళ్లు కడుక్కున్న ఆమె.. గణపతి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన పూజారి విష్ణు నంబూద్రి ముర్ముకు ఇరుముడి కట్టారు. భద్రతాధికారులు సౌరభ్‌ నాయర్‌, వినయ్‌ మాథుర్‌లతో పాటు ముర్ము అల్లుడు గణేశ్‌చంద్ర హోంబ్రమ్‌కు కూడా ఇరుముడు కట్టారు. నల్ల చీరతో తలపై ఇరుముడి పెట్టుకొని రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక వాహనంలో సన్నిధానానికి చేరుకున్నారు. పవిత్రమైన 18 బంగారు మెట్లు ఎక్కారు. అయ్యప్ప స్వామిని దర్శించుకొని, ఇరుముడి సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తొలి మహిళా రాష్ట్రపతిగా నిలిచారు. అంతకుముందు 1970ల్లో అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. ఆయన డోలీలో సన్నిధానానికి చేరుకున్నారు. తాజాగా ముర్ము ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ వాహనంలో సన్నిధానానికి వెళ్లారు.

Updated Date - Oct 23 , 2025 | 04:41 AM