Siddaramaiah vs DK Shivakumar: ఆ పదవికి రాజీనామా.. తేల్చి చెప్పిన డీకే శివకుమార్..
ABN , Publish Date - Nov 20 , 2025 | 07:49 AM
డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారని జరుగుతున్న ప్రచారంపై ఓ క్లారిటీ వచ్చింది. తాను రాజీనామా చేయబోతున్నది పీసీసీ చీఫ్ పదవికి మాత్రమేనని, పార్టీకి కాదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తనుందని జరుగుతున్న ప్రచారంపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. తాను పీసీసీ చీఫ్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీకి కాదని స్పష్టం చేశారు. పీసీసీ పదవికి రాజీనామా చేసినా కూడా ఫ్రంట్ రోలోనే ఉంటానని అన్నారు. నిన్న(బుధవారం) సాయంత్రం బెంగళూరులో పార్టీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ.. ‘నేను పీసీసీ చీఫ్ పోస్టులో ఎల్లకాలం ఉండలేను. ఇప్పటికే ఐదున్నర ఏళ్లు గడిచిపోయింది.
మార్చి వస్తే ఆరేళ్లు అవుతుంది’ అని అన్నారు. తన మద్దతుదారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆయన వారికి భరోసా ఇచ్చారు. ‘మీరేం భయపడకండి. నేను ఎప్పుడూ ఫ్రంట్ లైన్‌లోనే ఉంటా. నేను నా పదవీకాలంలో రాష్ట్రంలో 100 కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు తెరవాలని కోరుకుంటున్నా. నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగిపోవాలని నిర్ణయం తీసుకున్నా. కానీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఇందుకు ఒప్పుకోలేదు. బాధ్యతలు కొనసాగించాలని ఆదేశించారు.
నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. పార్టీ కోసం బాగా కష్టపడేవారికి ఆశలు ఉంటాయి. దాన్ని మనం తప్పంటామా?’ అని అన్నారు. కాగా, ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధారామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య మొదటి నుంచి గొడవ నడుస్తోంది. 2023లో పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ఒకరకంగా యుద్ధం జరిగింది. అధిష్టానం డీకే శివకుమార్‌కు నచ్చ జెప్పింది. ఇద్దరి మధ్యా ఓ ఒప్పందం కుదిర్చింది. చెరో రెండున్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రులుగా ఉండేలా తీర్మానం జరిగింది. అయితే, జూన్ నెలకే రెండున్నర ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, డీకేకు మాత్రం ముఖ్యమంత్రి పదవి రాలేదు. అప్పటినుంచి ఆయన అసహనంతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ లిఫ్ట్ పాడుగానూ... ముక్కుపచ్చలారని బాలుడిని..
నా తల్లిని భారత్ రక్షించింది.. ప్రధాని మోదీకి రుణపడి ఉంటాం: షేక్ హసీనా కుమారుడు