PM modi : ఎల్లుండి బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో ప్రధాని పర్యటన
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:47 PM
ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోదీ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీహార్‌లోని గయలో దాదాపు రూ.13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత..
న్యూఢిల్లీ, ఆగస్టు 20 : ఎల్లుండి (ఆగస్టు 22) ప్రధాని నరేంద్ర మోదీ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు బీహార్‌లోని గయలో దాదాపు రూ.13,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత, గంగా నదిపై ఆంటా-సిమారియా వంతెన ప్రాజెక్టును సందర్శించి ప్రారంభిస్తారు.
బీహార్‌లో ప్రధానమంత్రి NH-31లో 8.15 కి.మీ. పొడవైన ఆంటా - సిమారియా వంతెనను ప్రారంభిస్తారు. దీంతోపాటు, గంగా నదిపై రూ. 1,870 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 1.86 కి.మీ. పొడవైన 6 లేన్ల వంతెన కూడా ఉంటుంది. ఇది పాట్నాలోని మోకామా - బెగుసరాయ్ లను డైరెక్ట్‌గా కలుపుతుంది.
అంతేకాకుండా, ప్రధానమంత్రి మోదీ NH-31లోని దాదాపు రూ. 1,900 కోట్ల విలువైన నాలుగు లేన్ల భక్తియార్‌పూర్ నుండి మోకామా సెక్షన్‌ను ప్రారంభిస్తారు. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. అటు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
బీహార్‌లో విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ, ప్రధానమంత్రి దాదాపు రూ.6,880 కోట్ల విలువైన బక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్ (660x1 MW)ను ప్రారంభిస్తారు. ఇది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతుంది. ఇంధన భద్రతను మెరుగుపరుస్తుంది. అంతేకాక, ఈ ప్రాంతంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీరుస్తుంది.
మరో వైపు, ఆరోగ్య మౌలిక సదుపాయాలకు ఊతం ఇస్తూ, ప్రధాని మోదీ ముజఫర్‌పూర్‌లో హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో అధునాతన ఆంకాలజీ OPD, IPD వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక ల్యాబ్, బ్లడ్ బ్యాంక్, 24 పడకల ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్), HDU (హై డిపెండెన్సీ యూనిట్) ఉన్నాయి. ఈ అత్యాధునిక సౌకర్యం బీహార్, పొరుగు రాష్ట్రాలలోని రోగులకు అధునాతనమైన సరసమైన క్యాన్సర్ చికిత్సను అందిస్తుంది.
పశ్చిమ బెంగాల్ పర్యటన
ప్రధాని మోదీ సాయంత్రం 4:15 గంటలకు కోల్‌కతాలో కొత్తగా నిర్మించిన మెట్రో రైలు సేవలను కూడా జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ప్రధాని మోదీ దీంతోపాటు పశ్చిమ బెంగాల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదే రోజు శ్రీకారం చుట్టబోతున్నారు. కోల్‌కతాలో మెట్రో రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 13.61 కి.మీ.ల పొడవునా కొత్తగా నిర్మించిన మెట్రో నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఆయన జెస్సోర్ రోడ్ మెట్రో స్టేషన్‌ను సందర్శిస్తారు. అక్కడ జెస్సోర్ రోడ్ నుండి నోపారా-జై హింద్ బిమన్‌బందర్ మెట్రో సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు.
జెస్సోర్ రోడ్ మెట్రో స్టేషన్ నుండి జై హింద్ బిమన్‌బందర్ వరకు ప్రధాని మెట్రో రైలులో ప్రయాణిస్తారు. ఈ ప్రాంతంలో రోడ్డు మౌలిక సదుపాయాలకు ప్రధాన ప్రోత్సాహకంగా, ప్రధానమంత్రి మోదీ రూ.1,200 కోట్లకు పైగా విలువైన 7.2 కి.మీ పొడవైన ఆరు లేన్ల ఎలివేటెడ్ కోనా ఎక్స్‌ప్రెస్‌వేకు పునాదిరాయి వేస్తారు. ఇది హౌరా, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు, కోల్‌కతా మధ్య కనెక్టివిటీని పెంచుతుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటక రంగానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.