PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు
ABN , Publish Date - Jul 09 , 2025 | 03:47 AM
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పనికిరావని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
బ్రెజిల్‌లో ప్రధాని మోదీ
పాక్, చైనాలకు పరోక్షంగా చురకలు
బ్రెజిల్ అత్యున్నతపౌర పురస్కారం ప్రదానం
బ్రెజిలియా, జూలై 8 : ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పనికిరావని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని, దాన్ని సమర్థించేవారిని భారత్, బ్రెజిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పరోక్షంగా పాకిస్థాన్, చైనాలను ఉద్దేశించి పేర్కొన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాతో కలిసి మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈమేరకు స్పష్టం చేశారు. పహల్‌గాం ఉగ్రదాడి సమయంలో భారత్‌కు బ్రెజిల్ మద్దతు ప్రకటించినందుకు ఆ దేశాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఆరోగ్యం, ఔషధాలు, అంతరిక్షం, ఆహారం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పలు అంశాల్లో ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. బ్రిక్స్ సమ్మిట్ అనంతరం ప్రధాని మోదీ బ్రెజిలియా చేరుకున్నారు. అల్వరాదా ప్యాలెస్ వద్ద 114 గుర్రాలతో పెరేడ్ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. కాగా ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’ ప్రదానం చేశారు.