PM Narendra Modi: రైతు ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదు
ABN , Publish Date - Aug 08 , 2025 | 05:38 AM
భారత రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ ప్రయోజనాల అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం అంశంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ ప్రయోజనాల అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవసరమైతే వ్యక్తిగతంగా కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా తమ దేశ వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలంటూ అమెరికా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై మోదీ స్పష్టతనిచ్చారు.
దేశం లో వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. కరువు, తీవ్ర ఎండలు, వరదలను తట్టుకునే వంగడాలను రూపొందించాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. కాగా, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా గురువారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, సాంకేతిక, రక్షణ భాగస్వామ్యంపై వారు చర్చించారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. బ్రెజిల్‌పై వాణిజ్య సుంకాల నేపథ్యంలో తాను ట్రంప్‌తో మాట్లాడబోనని, అవసరమైతే మోదీతో మాట్లాడుతానని పేర్కొన్న మర్నాడే ఆయన మోదీకి ఫోన్ చేశారు.