PM Modi: ప్రజలే దేవుళ్లు
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:23 AM
ప్రజలే దేవుళ్లు అనే దృక్పథంతో పని చేయాలని సివిల్ సర్వీసెస్ అధికారులకు ప్రధాని మోదీ సూచించారు. అభివృద్ధి చిట్టచివరి వ్యక్తికీ చేరాలన్నదే లక్ష్యమన్నారు
ఐఏఎస్‌లు పాలకులు మాత్రమే కాదు ‘పురోగామి భారత’ రూపశిల్పులు
‘సివిల్ సర్వీసెస్ డే’ వేడుకల్లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: అణగారిన వర్గాల సమస్యలు పరిష్కరించే క్రమంలో ‘నాగరిక్ దేవోభవ(ప్రజలే దేవుళ్లు)’ సూత్రాన్ని పాటించాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. ఇది ‘అతిథి దేవోభవ’లాంటిదేనని, ఇదే సత్పరిపాలన మంత్రం కావాలని ఆకాంక్షించారు. సోమవారం ‘17వ సివిల్ సర్వీసెస్ డే’ వేడుకల్లో ఆయన ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి అందరికీ అందాలని, చిట్టచివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకూర్చాలని ఉద్బోధించారు. ‘ఐఏఎస్ అధికారులు తమను తాము కేవలం పాలకులుగా భావించవద్దు. మీరు పురోగామి భారత రూపశిల్పులు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు మారుతున్నాయి. సమకాలీన సవాళ్లకు అనుగుణంగా సివిల్ సర్వీసెస్ అధికారులు మారాలి. బడుగు వర్గాల ఈతిబాధలు వినాలి. వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి. ప్రజలే మన దేవుళ్లు. ఈ దృక్పథంతోనే గత పదేళ్ల కాలంలో 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించాం. ఇది పేదరికరహిత భారత్‌కు దారితీస్తుందని విశ్వసిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాలం చెల్లిన ప్రణాళికలతో అధికార యంత్రాంగం పనిచేయజాలదన్నారు. వచ్చే వెయ్యేళ్ల భవిష్యత్‌ను రూపుదిద్దే విధానాల తయారీపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని తెలిపారు. ఈ విజన్‌ను నెరవేర్చేందుకు అధికారులంతా ప్రతి రోజూ, ప్రతి క్షణం అవిశ్రాంతంగా కృషిచేయాలని కోరారు. భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించేలా చేయడంలో సివిల్ సర్వెంట్ల బాధ్యత చాలా పెద్దదన్నారు.