PM Modi: ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్.. తక్షణ శాంతికి పిలుపు
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:38 PM
తక్షణం ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ముందుకు వెళ్లాలని ఇరాన్ అధ్యక్షుడికి మోదీ సలహా ఇచ్చారు. ఉద్రిక్తతలు పెరగడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: మధ్యప్రాశ్చంలో దాడులు ఉద్రిక్తం కావడం, అమెరికా వైమానిక దళం ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడు అణుస్థావరాలపై భారీ దాడులు జరిపిన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian)తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఫోనులో మాట్లాడారు. తక్షణం ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారు. ఉద్రిక్తతలు పెరగడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వెల్లడించారు. 'ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితి చర్చించాం. తాజా ఉద్రిక్తలతో ఆందోళనను తెలియజేశాను. ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణం చర్చలు, దౌత్య మార్గాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాంతీయ శాంతి, భద్రత, సుస్థిరతను పునరుద్ధరించాలని సలహా ఇచ్చాను' అని మోదీ పేర్కొన్నారు.
ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలంపై అమెరికా సైన్యం ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిపించింది. బీ2 స్టెల్త్ బాంబర్లను ప్రయోగించింది. ఫోర్డో, నటాంజ్, ఎస్ఫాహాన్‌లోని అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడులను అద్భుతమైన సైనిక విజయంగా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణుసామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఇరాన్ ఇప్పటికైనా శాంతి కోసం అడుగులు వేయాలని సూచించారు. కాగా, అమెరికా దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా దాడి ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంది. సభ్య దేశాల సౌర్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గురించి గౌరవించాల్సి ఉంటుందని తెలిపింది. అమెరికా చర్యను ఐరాస భద్రతా మండలి ఖండించాలని విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు
పాక్ ఇప్పుడేమంటుంది, ట్రంప్‌కు నోబెల్ ఇద్దామా.. ఒవైసీ నిప్పులు
For National News And Telugu News