Share News

PM Narendra Modi: ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా భారత్‌

ABN , Publish Date - May 02 , 2025 | 05:12 AM

భారతదేశాన్ని ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముంబైలో వేవ్స్‌ సమ్మిట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, క్రియేటివ్‌ టెక్నాలజీ సంస్థను స్థాపించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

PM Narendra Modi: ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా భారత్‌

క్రియేట్‌ ఇన్‌ ఇండియా.. క్రియేట్‌ ఫర్‌ వరల్డ్‌

వేవ్స్‌ సదస్సులో ప్రధాని మోదీ ఆకాంక్ష

ముంబైలో అట్టహాసంగా వేవ్స్‌ ప్రారంభం

వేవ్స్‌తో ‘ఆరెంజ్‌ ఎకానమీ’కి నాంది: మోదీ

భానుమతి, గురుదత్‌, సలీల్‌ స్టాంపుల విడుదల

400 కోట్లతో క్రియేటివ్‌ టెక్నాలజీ: అశ్వినీ వైష్ణవ్‌

ముంబై, మే 1: ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా భారత్‌ మారనుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ముంబైలో నాలుగు రోజుల పాటు జరగనున్న వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌(వేవ్స్‌)ను ఆయన గురువారం అట్టహాసంగా ప్రారంభించారు. సినీ నిర్మాణం, డిజిటల్‌ కంటెంట్‌, గేమింగ్‌, ఫ్యాషన్‌, సంగీతం, ప్రత్యక్ష సంగీత కచేరీలకు వేవ్స్‌ వేదికకానుంది. 100కు పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వినోదరంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సదస్సును ఏర్పాటు చేయగా.. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ దిగ్గజాలు షారుఖ్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, హేమమాలిని, దీపిక పదుకొనే, అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, ఎంఎం కీరవాణి, శ్రీలీల, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కీరవాణి స్వరకల్పనలో రుగ్వేదంలోని శ్లోకాలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ గీతాన్ని శ్రేయాఘోషల్‌, చిత్ర, మంగ్లి, లిక్సిక ఆలపించారు. భానుమతి, గురుదత్‌, సలీల్‌ చౌదరిల శతజయంతి సందర్భంగా ఇదే వేదికపై వారి స్టాంపులను ప్రధాని ఆవిష్కరించారు.

fgh.jpg

భానుమతి మనవరాలు మీనాక్షి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మారుతోందని, వేవ్స్‌ వల్ల ఆరెంజ్‌ ఎకానమీకి నాంది పడుతుందన్నారు.


‘‘సృజనాత్మకతకు కేంద్రంగా వేవ్స్‌ తయారై.. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. 1913లో రాజా హరిశ్చంద్ర సినిమాతో మన దేశ ఘనత నలుదిశలకు వ్యాపించింది. ఇటీవల 50 దేశాల గాయకులు ‘వైష్ణవ జనతో’ గీతాన్ని ఆలపించారు. సృజన ఉన్న యువత దేశానికి అసలుసిసలు ఆస్తి. కంటెంట్‌ క్రియేటర్లను ప్రోత్సహిస్తాం. క్రియేట్‌ ఇన్‌ ఇండియా, క్రియేట్‌ ఫర్‌ వరల్డ్‌’’అని పేర్కొన్నారు. ‘‘వేవ్స్‌ అనేది సంస్కృతి, సృజనల అనుసంధానం. సృజనను ప్రోత్సహించేందుకు త్వరలో ‘వేవ్స్‌ అవార్డు’లను ప్రవేశపెడతాం’’ అన్నారు. ప్రధాని మోదీ పోరాటయోధుడని ప్రముఖ నటుడు రజనీకాంత్‌ ప్రశంసించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వేవ్స్‌ కార్యక్రమాన్ని వాయిదా వేస్తారని కొందరు భావించారని చెప్పా రు. కానీ ఈ కార్యక్రమం వాయుదా పడదని తాను గాఢంగా నమ్మానన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వినోద రంగంలో భారత్‌ అగ్రగామిగా నిలుస్తుందని బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ అభిప్రాయపడ్డారు. కాగా ఐఐఎం,ఐఐటీల తరహాలో క్రియేటర్ల కోసం రూ.400 కోట్లతో ముంబైలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీని ప్రారంభిస్తామని కేంద్ర ఐటీ, సమాచారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి భూమిని ఇవ్వటానికి అంగీకరించిందన్నారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 06:03 AM