Share News

Modi on Terrorism: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:06 AM

పహల్గాం ఉగ్రదాడికి కఠినంగా ప్రతీకారం తీర్చేందుకు త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాద దాడులు, సైబర్‌ దాడులు, పాక్‌ ప్రేరిత కుట్రలపై అత్యున్నత స్థాయి భద్రతా సమావేశంలో కీలకంగా చర్చించారు.

Modi on Terrorism: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా

దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారిదే

వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది

ఉగ్రవాదులకు, వారిని పెంచి పోషిస్తున్నవారి

ఊహకైనా అందనంత కఠిన శిక్షలు విధిస్తాం

అత్యున్నతస్థాయి రక్షణ భేటీలో ప్రధాని మోదీ

నేడు రెండోసారి సమావేశం కానున్న సీసీఎస్‌

కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ భేటీ కూడా!

‘పహల్గాం’పై చర్చకు పార్లమెంట్‌ను సమావేశ పరచండి

ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ నేతలు

రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా.. ఎలాంటి దాడులైనా చేసేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని.. ఎక్కడ (టార్గెట్‌), ఎప్పుడు (టైమింగ్‌), ఎలా (మోడ్‌) చేయాలో నిర్ణయించే అధికారం కూడా వాటిదేనని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ఇక్కడ తన నివాసంలో అత్యున్నత స్థాయి రక్షణ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ.. భారత దళాల శక్తిసామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని స్పష్టం చేశారు. ప్రధాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, త్రివిధ దళాధిపతులు, మహా దళపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌) అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌ పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు.

jujujujujuju.jpg

ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నది జాతీయ సంకల్పమన్న ప్రధాని.. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను, దాడి కుట్రదారులను, వారిని పెంచి పోషిస్తున్నవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని.. వారి ఊహలకు కూడా అందనంత అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని హెచ్చరించినట్టు సమాచారం.


కాగా.. జూలైలో జరిగే అమర్‌నాథ్‌ యాత్రకు రక్షణ ఏర్పాట్లు ఏలా చేయాలి, దేశంలో కీలకమైన ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరగకుండా ఎలా నిరోధించాలి, పాక్‌ కవ్వింపు చర్యలకు ఏ విధంగా బదులునివ్వాలి, అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకి ఎలా చేయాలనే అంశాలపై కూడా ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. అలాగే.. జమ్ము జిల్లాలోని అఖ్నూర్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ సైన్యాలు వరుసగా ఐదోసారి కాల్పులు జరిపిన వైనంపైనా చర్చించారు. రక్షణ శాఖకు చెందిన విభాగాలపై పాకిస్తాన్‌ సైబర్‌ దాడుల గురించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు.

hygbjl.jpg

శ్రీనగర్‌, రాణిఖేడ్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లు, ఆర్మీ గృహ సంక్షేమ సంస్థ, తదితర సంస్థల వెబ్‌సైట్లను ఐవోకే హ్యాకర్‌ పేరిట పాక్‌ హ్యాక్‌ చేసింది. ఆ వెబ్‌సైట్ల హోం పేజీలో ‘సైట్‌ హ్యాక్‌డ్‌’ అన్న వాక్యాలతో పాటు పాకిస్థాన్‌ జెండా, ముసుగుతో ఒక ఆగంతకుడి చిత్రం కనపడుతున్నాయి.


ఈ భేటీకి ముందు.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ భేటీకి మూడు పారామిలటరీ దళాల అధిపతులు, రెండు భద్రత సంస్థల సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. అయితే, ఆ సమావేశం అజెండా ఏమిటో అధికారికంగా వెల్లడించలేదు. కాగా.. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరగనున్న జాతీయ భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) భేటీలో.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. వారంరోజుల వ్యవధిలో సీసీఎస్‌ భేటీ జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ కమిటీలో ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి జయశంకర్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశం కూడా జరగనుంది.


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 30 , 2025 | 06:16 AM