Share News

PM Modi Xi Meeting: సరిహద్దు లేని బంధం!

ABN , Publish Date - Sep 01 , 2025 | 05:08 AM

భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదాలకు సహేతుకమైన, పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నిర్ణయానికి వచ్చారు.

PM Modi Xi Meeting: సరిహద్దు లేని బంధం!

  • సమస్యను సహేతుకంగా తేల్చుకుందాం

  • సరిహద్దు సమస్య మన బంధానికి అడ్డురావొద్దు

  • ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెంచుకుందాం

  • శత్రువుల్లా కాదు.. అభివృద్ధి భాగస్వాములుగా రాజకీయ, వ్యూహాత్మక కోణంలో సాగుదాం

  • ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నిర్ణయం

  • బంధం బాగుండాలంటే శాంతి, స్థిరత్వం ముఖ్యం

  • పరస్పర నమ్మకం, గౌరవంతో ముందుకెళదాం మన బంధాలను మూడో దేశం కోణంలో చూడొద్దు

  • భారత్‌, చైనా మధ్య సహకారం మానవాళి సంక్షేమానికి బాటలు వేస్తుంది: మోదీ

  • భారత్‌-చైనా స్నేహితులుగా ఉండడమే మంచిది

  • డ్రాగన్‌, ఏనుగు కలిసి డ్యాన్స్‌ చేయాలి: జిన్‌పింగ్‌

  • వచ్చే ఏడాది భారత్‌లో జరిగే బ్రిక్స్‌ సదస్సుకు రావాలని జిన్‌పింగ్‌కు మోదీ ఆహ్వానం

  • బ్రిక్స్‌ అధ్యక్షత కోసం భారత్‌కు జిన్‌పింగ్‌ మద్దతు

టియాంజిన్‌ (చైనా), ఆగస్టు 31: భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదాలకు సహేతుకమైన, పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నిర్ణయానికి వచ్చారు. ఇరుదేశాల వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యలపై అంగీకారానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీరుతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అస్థిరత నెలకొన్న సమయంలో మోదీ, జిన్‌పింగ్‌ భేటీలో వాణిజ్యంపై ప్రత్యేకంగా చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన ప్రధాని మోదీ.. ఆదివారం జిన్‌పింగ్‌తో భేటీ అయి చర్చించారు. మోదీ, జిన్‌పింగ్‌ భేటీకి సంబంధించి విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింత పెంచేందుకు, వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు తీసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. ఉగ్రవాద నిర్మూలన, సహేతుక వాణిజ్యం అంశాలపై అంతర్జాతీయ వేదికలపై పరస్పర అవగాహనతో వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రపంచ వాణిజ్యంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో ఇరుదేశాల పాత్ర కీలకమని గుర్తించారు. ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి రాజకీయ, వ్యూహాత్మక కోణంలో ముందుకు సాగాల్సిన అవసరంపై ప్రత్యేకంగా చర్చించారు. భారత్‌-చైనా శత్రువులు కాదని.. అభివృద్ధి భాగస్వాములని మోదీ, జిన్‌పింగ్‌ పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారవద్దని పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేయడానికి వీలుగా.. నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, వీసా ప్రక్రియ సరళతరం చేయడం, పర్యాటక వీసాల జారీ, మానస సరోవర్‌ యాత్ర పునః ప్రారంభం వంటి చర్యలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ఇరు దేశాల సరిహద్దుల్లో సైన్యాలను వెనక్కితీసుకోవడం, ఉద్రిక్తలను తగ్గించేందుకు తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు’’ అని విదేశాంగ శాఖ తెలిపింది.


శాంతి, స్థిరత్వం ముఖ్యం: మోదీ

భారత్‌-చైనా సంబంధాలు బలోపేతం కావాలంటే.. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. పరస్పర నమ్మకం, గౌరవం ఆధారంగా ఇరుదేశాల సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌ కట్టుబడి ఉందని వివరించారు. భారత్‌, చైనా వ్యూహాత్మక స్వావలంబన పొందిన దేశాలని, ఈ రెండింటి మధ్య సంబంధాలను మూడో దేశం కోణంలో చూడొద్దని భేటీలో స్పష్టం చేశారు. భారత్‌, చైనా మధ్య సహకారం 280 కోట్ల మంది ప్రయోజనాలకు సంబంధించినదని.. ఇది ప్రపంచ మానవాళి సంక్షేమానికి మార్గం వేస్తుందని పేర్కొన్నారు.

ప్రత్యర్థులం కాదు..భాగస్వాములం: జిన్‌పింగ్‌

భారత్‌, చైనా స్నేహితులుగా ఉండటమే సరైన ఎంపిక అని.. సరిహద్దు సమస్యలు ఇరుదేశాల బంధాలను ప్రభావితం చేయవద్దని ప్రధాని మోదీతో జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ఇరుగుపొరుగు దేశాలుగా, ఒకరి విజయానికి మరొకరు తోడ్పడే భాగస్వాములుగా ఉండాలని.. డ్రాగన్‌ (చైనా చిహ్నం), ఏనుగు (భారత చిహ్నం) కలసి నృత్యం చేయాలని వ్యాఖ్యానించారు. భారత్‌, చైనా ప్రత్యర్థులు కావని, సహకార భాగస్వాములని అభివర్ణించారు. ట్రంప్‌ ఏకపక్ష విధానాలను పరోక్షంగా విమర్శిస్తూ.. బహుళ ధ్రువ ప్రపంచం కోసం, అంతర్జాతీయ సంబంధాల్లో మరింత ప్రజాస్వామ్యం కోసం, ఆసియాలో, ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు భారత్‌, చైనా కలసి పనిచేయాలని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని, శతాబ్దానికోసారి జరిగే మార్పులు వస్తున్నాయని చెప్పారు. కాగా, ఎస్‌ఈవోకు చైనా అధ్యక్షత వహించడం, టియాంజిన్‌లో సదస్సు నిర్వహణపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు రావాల్సిందిగా షీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు కాయ్‌ ఖితో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు.


బ్రిక్స్‌ దేశాలపై ఆంక్షలను ఖండిస్తున్నాం: పుతిన్‌

భారత్‌, రష్యా, చైనా సహా పది దేశాలతో కూడిన బ్రిక్స్‌ కూటమికి వ్యతిరేకంగా అమెరికా చేపడుతున్న చర్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మండిపడ్డారు. ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు టియాంజిన్‌కు వచ్చిన ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బ్రిక్స్‌ దేశాల సామాజిక ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసేలా విధిస్తున్న వివక్షాపూరిత ఆంక్షలను రష్యా, చైనా ఉమ్మడిగా ఖండిస్తున్నాయని చెప్పారు. అమెరికా ఆధిపత్యం వహిస్తున్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎ్‌ఫ)లను పునర్వ్యవస్థీకరించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నామన్నారు. కొత్త ఆర్థిక వ్యవస్థలలో నిజమైన సమానత్వం, పారదర్శకత అవసరమని స్పష్టం చేశారు. కాగా, ఎస్‌ఈవో సదస్సుకు హాజరైన పుతిన్‌తో ప్రధాని మోదీ సోమవారం భేటీకానున్నారు.

Updated Date - Sep 01 , 2025 | 05:45 AM