Peter Navarro: రష్యా చమురుతో ‘బ్రాహ్మణులే’ లాభపడుతున్నారు
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:15 AM
భారత్‌పై నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్న వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరింతగా రెచ్చిపోయారు. రష్యా చమురు వ్యవహారంలో బ్రాహ్మణులే లాభపడుతున్నారని వ్యాఖ్యానించారు (ఆయన ఏ అర్థంలో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ..
రష్యాకు భారత్ ఓ లాండ్రీవాలా
మళ్లీ నోరు పారేసుకున్న నవారో
వాషింగ్టన్, సెప్టెంబరు 1: భారత్‌పై నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్న వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరింతగా రెచ్చిపోయారు. రష్యా చమురు వ్యవహారంలో బ్రాహ్మణులే లాభపడుతున్నారని వ్యాఖ్యానించారు (ఆయన ఏ అర్థంలో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ.. అమెరికాలో అత్యంత సంపన్నులైన వ్యాపారవర్గాలకు చెందిన ప్రొటెస్టెంట్లను బోస్టన్ బ్రాహ్మిన్స్‌గా వ్యవహరిస్తారు. ఈ వ్యవహారంలో సంపన్ననలైన వ్యాపారులే లాభపడుతున్నారనే అర్థంలో నవారో ఈ వ్యాఖ్యలు చేసినట్టు కొంతమంది చెబుతున్నారు). చైనా, రష్యాలకు భారత్ దగ్గర అవుతుండటంపై ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో అక్కసు వెళ్లగక్కారు. మోదీ వంటి గొప్ప ప్రజాతంత్ర నాయకుడు.. పుతిన్, జిన్‌పింగ్‌లతో ఎందుకు అంటకాగుతున్నారో తనకు తెలియడం లేదన్నారు. ‘ఇదంతా ‘బ్రాహ్మణులు’ చేస్తున్నారు. వారు తమ లాభాల కోసం తక్కిన జనం ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఈ విషయం భారత ప్రజలు తెలుసుకోవాలి.’’ అని అన్నారు. ‘‘ముడిచమురుపై మోదీకి పుతిన్ రాయితీలు ఇచ్చారు. భారత్‌లో దానిని శుద్ధిచేయించి, యూరప్, ఆఫ్రికా, ఆసియాలకు సరఫరా చేసి పెద్దఎత్తున డబ్బులు చేసుకుంటున్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఈ డబ్బులను వాడుతున్నారు. అలాంటప్పుడు సుంకాల చెల్లింపుదారులుగా అమెరికా ఏం చేయాలి.’’ అని నవారో ప్రశ్నించారు. భారత్ సుంకాల మహారాజులా మారిందన్న ఆయన, క్రెమ్లిన్‌కు ల్యాండ్రోమ్యాట్‌గా (లాండ్రీవాలా) భారత్ పని చేస్తోందని నోరు పారేసుకున్నారు. కాగా.. నవారో వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ వాణిజ్య సలహామండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ నవారో వ్యాఖ్యలను ఽఖండించారు. బ్రాహ్మణులను ఉద్దేశించి నవారో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, అవి ఆయన కురచబుద్ధిని బయటపెట్టాయని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో బ్రాహ్మణ పదానికి వేరే అర్థం ఉంది. సంపన్న కులీన వర్గాన్ని ఆ పేరుతో పిలుస్తారు. దానికీ, కులవ్యవస్థకూ సంబంధమే లేదు. కానీ, దురుద్దేశంతో ఆ పదాన్ని నవారో ఉపయోగించారు.’’ అని ఆమె మండిపడ్డారు. ఇదిలా ఉండగా, రష్యా, చైనా, భారత్ ఒక వేదిక మీదకు వచ్చిన వేళ...భారత్‌పై అమెరికా అనూహ్యంగా స్వరం మార్చింది. నిన్నటిదాకా నోటికి వచ్చినట్టు భారత్‌పై విమర్శలు చేసిన అమెరికా ప్రభుత్వం ఒక్కసారిగా స్నేహగీతికను ఆలపించింది. ‘‘21వ శతాబ్దంలో మా సంబంధాలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి. మా బంధం అర్ధవంతమైంది. మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే పలు అంశాలపై ఈ నెలలోనే దృష్టి సారించనున్నాం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోంది: సుదర్శన్ రెడ్డి
BJP మిత్రపక్షం BRS అనే నిజాన్ని నిర్వీర్యం చేసే అవకాశం అందిపుచ్చుకోండి : సామా