Pen Cap Stuck In Lung: అత్యంత అరుదైన సంఘటన.. 26 ఏళ్లుగా వ్యక్తి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్
ABN , Publish Date - Aug 30 , 2025 | 08:21 PM
గత కొద్దిరోజులనుంచి అతడికి తరచుగా దగ్గు వస్తూ ఉంది. దగ్గుతున్నపుడు గళ్లలో రక్తం పడుతూ ఉంది. దీంతో భయపడిపోయిన అతడు ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అతడికి అన్ని రకాల పరీక్షలు చేశారు.
ఓ వ్యక్తి చిన్నపుడు పొరపాటున పెన్ క్యాప్ మింగేశాడు. ఆ క్యాప్ ఏకంగా 26 ఏళ్ల పాటు అతడి ఊపిరితిత్తుల్లో ఉండిపోయింది. తాజాగా, డాక్టర్లు ఆపరేషన్ చేసి పెన్ క్యాప్‌ను బయటకు తీశారు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏడేళ్ల వయసులో ఆడుకుంటూ ప్లాస్టిక్ పెన్ క్యాప్ మింగేశాడు. అయితే, ఆ విషయాన్ని అతడు తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆశ్చర్యకరంగా అతడికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదు.
కానీ, గత కొద్దిరోజులనుంచి తరచుగా దగ్గు వస్తూ ఉంది. దగ్గుతున్నపుడు గళ్లలో రక్తం పడుతూ ఉంది. దీంతో భయపడిపోయిన అతడు ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అతడికి అన్ని రకాల పరీక్షలు చేశారు. అతడి ఊపిరితిత్తుల్లో ఏదో వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అది అక్కడే ఉంటే ప్రాణాలకు ముప్పు తప్పదని భావించారు. సర్జరీ చేసి దాన్ని బయటకు తీశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. అతడి ఊపిరితిత్తుల్లో ఉన్నది ప్లాస్టిక్ పెన్ క్యాప్ అని తెలిసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.
ఈ సంఘటనపై సర్జరీ చేసిన డాక్టర్ రోమన్ దత్తా మాట్లాడుతూ.. ‘ఇలాంటి కేసులు ఇండియాలో అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఒక వస్తువు ఊపిరితిత్తుల్లో ఇంతకాలం ఉన్నప్పటికి అతడి ఎలాంటి పెద్ద సమస్యలు రాకపోవటం అన్నది అసాధారణ విషయం. సమయం గడిచే కొద్ది అలాంటివి ప్రాణాలు తీసే అవకాశం ఉంది’ అని అన్నారు. ఇక, సదరు వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎవరైనా ఏదైనా వస్తువును మింగితే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అన్నారు. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో ఆలస్యం చేయకూడదని, లేదంటే దాని వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి
హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..
జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..