Share News

RAW Chief: రా చీఫ్‌గా పరాగ్‌

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:50 AM

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై పక్కాగా నిఘా పెట్టి, ఆపరేషన్‌ సిందూర్‌తో గట్టి దెబ్బకొట్టడంలో కీలకపాత్ర పోషించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌.. భారత అంతర్జాతీయ నిఘా సంస్థ ‘రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా)కు నూతన చీఫ్‌గా నియమితులయ్యారు.

RAW Chief: రా చీఫ్‌గా పరాగ్‌

  • 1989 పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి

  • 20 ఏళ్లకు పైగా ‘రా’లో కీలక బాధ్యతలు

న్యూఢిల్లీ, జూన్‌ 28: పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై పక్కాగా నిఘా పెట్టి, ఆపరేషన్‌ సిందూర్‌తో గట్టి దెబ్బకొట్టడంలో కీలకపాత్ర పోషించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌.. భారత అంతర్జాతీయ నిఘా సంస్థ ‘రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా)’కు నూతన చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ‘రా’ కార్యదర్శిగా ఉన్న రవి సిన్హా పదవీ విరమణ చేస్తుండటంతో.. జూలై 1వ తేదీ నుంచి పరాగ్‌ జైన్‌ ఆ బాధ్యతలు స్వీకరిస్తారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. భారత్‌ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను పాకిస్థాన్‌ మళ్లీ పునరుద్ధస్తోందంటూ వార్తలు వస్తున్న వేళ పరాగ్‌ జైన్‌ నియామకం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 1989 పంజాబ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన పరాగ్‌ జైన్‌.. సుమారు 20 ఏళ్లకుపైగా నిఘా, డిటెక్టివ్‌ విభాగాల్లో పనిచేశారు. ‘రా’ లో పాకిస్థాన్‌ డెస్క్‌, జమ్మూకశ్మీర్‌ వ్యవహారాల బాధ్యతలు పర్యవేక్షించారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ సమయంలోనూ కీలక పాత్ర పోషించారు. లష్కరేతాయిబా ప్రధాన కార్యాలయం సహా పాకిస్థాన్‌లోని కీలక ఉగ్రవాద స్థావరాలపై నిఘా పెట్టి కీలక సమాచారం సేకరించారు. ఈ డేటా ఆధారంగానే మన వైమానిక దళం అత్యంత కచ్చితత్వంతో పౌరులకు ఎలాంటి హానీ జరగకుండా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగలిగిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jun 29 , 2025 | 04:51 AM