Palwasha Mohammad Zai Khan: మరో పాక్ నేత వాచాలత.. కొత్త బాబ్రీ మసీదు తొలి ఇటుక పేర్చేది తమ సైనికులేనంటూ కామెంట్
ABN , Publish Date - May 01 , 2025 | 02:02 PM
పాక్ మహిళా సెనెటర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త బాబ్రీ మసీదు తొలి ఇటుక పేర్చేది తమ సైనికులేనని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ నేతలు నోటికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. తాజాగా పాక్ సెనెటర్ పల్వాషా మొహమ్మద్ జాయ్ ఖాన్.. మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు నిర్మాణానికి పాక్ సైనికులే తొలి పునాది రాయి వేస్తారని వ్యాఖ్యానించారు. పాక్ ఎగువ సభలో ఆమె చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కొత్త బాబ్రీ మసీదు పునాది రాయిని పాక్ సైనికులు వేస్తారని అన్న ఆమె.. అక్కడ తొలి ప్రార్థనను ఆర్మీ చీఫ్ మునీర్ స్వయంగా చేస్తారని చెప్పుకొచ్చారు. తామేమీ చేతులకు గాజులు తొడుక్కుని కూర్చోలేదని కూడా అన్నారు. భారత్‌తో యుద్ధం జరిగితే సిక్కు సైనికులు పాక్‌పై దాడి చేయరని కూడా అన్నారు. ‘‘పాక్ అంటే గురునానక్‌కు చెందిన భూమి. సిక్కు సైనికులు దాడి చేయరు. పాక్‌ను బెదిరించే వారికి ఈ విషయం చెప్పిండి’’ అంటూ నోటికొచ్చినట్టు వ్యాఖ్యానించారు.
అంతకుమునుపు, పాక్ నేత బిలావల్ భుట్టో కూడా భారత్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సింధూ నది ఒప్పందం నిలుపుదలపై ఓ బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన వివాదాస్పద వ్యా్ఖ్యలు చేశారు. సింధూ నదిలో తమ నీరు నిలిచిపోతే వారి రక్తం ప్రవహిస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇక పాక్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్‌తో ఉద్రిక్తతలపై స్పందించారు. తాము శాంతినే కోరుతున్నామని, కానీ తమ సహనాన్ని బలహీనతగా భావించొద్దని అన్నారు.
ఇదిలా ఉంటే.. పాక్‌పై ఇప్పటికే భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పాక్ విమానాలకు భారత గగన తలాన్ని మూసివేసింది. అయితే, భారత్‌లోని పాకిస్థానీలకు మాత్రం స్వల్ప ఊరటనిచ్చే ఆదేశాలను జారీ చేసింది. అట్టారీ వాఘా బార్డర్ మీదుగా దేశాన్ని వీడేందుకు అనుమతించింది. పహల్గాం దాడి తరువాత భారత్ ఈ సరిహద్దును మూసేసిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.. భారత్, పాక్‌లకు అమెరికా పిలుపు
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!
మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత
Read More Latest Telugu News and National News