Operation Sindoor: మా సైనికులు11 మంది చనిపోయారు
ABN , Publish Date - May 14 , 2025 | 05:05 AM
భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన దాడిలో తమ 11 మంది సైనికులు చనిపోయారని పాక్ ఆర్మీ ప్రకటించింది. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ ఉన్నారు కాగా, 40 మంది పౌరులు కూడా మరణించారని వెల్లడించింది.
78 మంది గాయపడ్డారు: పాక్ ఆర్మీ
ఇస్లామాబాద్, మే 13: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో తమ స్క్వాడ్రన్ లీడర్ సహా 11 మంది సైనికులు చనిపోయారని, మరో 78 మంది గాయాలపాలయ్యారని పాక్ మిలటరీ ప్రకటించింది. అంతేకాక, మరో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 121 మంది గాయపడ్డారని పేర్కొంది. మృతుల్లో పాక్ వాయుసేనకు చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగ్‌జేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్ తదితరులు ఉన్నారని వెల్లడించింది. కాగా, రావల్పిండిలోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ సోమవారం స్వయంగా పరామర్శించారు. మరోపక్క, కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ మంగళవారం ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్‌పై ప్రసంగిస్తూ మోదీ సోమవారం చేసిన వ్యాఖ్యలను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించింది. కాల్పుల విరమణ కోరుతూ భారత్ వద్దకు పాకిస్థాన్ పరుగెత్తుకుంటూ వచ్చిందనేది మరో పచ్చి అబద్ధం అని ఆరోపించింది. మోదీ వ్యాఖ్యలు, భారత్ తీరు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.