Share News

Hashim Musa: పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్.. మహాదేవ్ పర్వతాల్లో మూసాను ఎలా మట్టుబెట్టారంటే..

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:41 PM

మహాదేవ్ పర్వత ప్రాంత పరిసరాలను కశ్మీర్ హిందువులు ప్రస్తుత సావన్ (శ్రావణ) మాసంలో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రాంతం నుంచి ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చైనా తయారీ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ 'టీ82' యాక్టివేట్ అయినట్టు సైనికులు గుర్తించారు.

Hashim Musa: పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్.. మహాదేవ్ పర్వతాల్లో మూసాను ఎలా మట్టుబెట్టారంటే..
Pahalgam Terror master mind Hashim Musa

అది శ్రీనగర్‌ (Sri Nagar)లో మహాదేవ్ పర్వత ప్రాంతం.. అక్కడ ఆదివారం అర్ధరాత్రి ఏదో అస్పష్టమైన కమ్యూనికేషన్ సిగ్నల్.. వెంటనే సైన్యం అప్రమత్తమైంది.. అది పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) సమయంలో ఉగ్రవాదులు వాడిన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ సిగ్నల్ అని సైన్యం గుర్తించింది.. దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో ఏడాది పొడవునా మంచుతో కప్పి ఉండే ఆ ప్రాంతంలోనే పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారులు ఉన్నట్టు కమాండోలు గుర్తించారు.. వెంటనే రంగంలోకి దిగి కేవలం మూడు గంటల్లోనే పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హషీమ్ మూసా (Hashim Musa)ను మట్టుబెట్టారు.


మహాదేవ్ పర్వత ప్రాంత పరిసరాలను కశ్మీర్ హిందువులు ప్రస్తుత సావన్ (శ్రావణ) మాసంలో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చైనా తయారీ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ 'టీ82' యాక్టివేట్ అయినట్టు సైనికులు గుర్తించారు. పహల్గాం దాడి సమయంలో ఉగ్రవాదులు వీటినే వాడారు. అలాంటి వాటినే ఆదివారం అర్ధరాత్రి మహాదేవ్ పర్వత ప్రాంతాల్లో వాడుతున్నట్టు తేలడంతో సైన్యం అప్రమత్తమైంది. డాచిగామ్ నేషనల్ పార్క్ ప్రాంతం నుంచి ఆ సిగ్నల్ వస్తున్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి.


సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్ము, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం 8 గంటలకు డ్రోన్లను ఎగురవేసి ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టి ముష్కరుల స్థావరాలను అంచనా వేశారు. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రీయ రైఫిల్స్, పారా ఎస్‌ఎఫ్ కమాండోలు ముష్కరుల స్థావరాల దగ్గర పొజిషన్ తీసుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫైరింగ్ ప్రారంభించారు. మొదటి రౌండ్లలోనే కొందరు ఉగ్రవాదులు నేలకొరిగారు. 11:45 గంటల సమయంలో గాయపడి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాది పైకి మరొకసారి కాల్పులు జరిపారు.


ఆ స్థావరానికి రెండు కిలోమీటర్ల మేర మొత్తం గాలింపు చేపట్టి ఇంకెవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత 12:45 గంటల సమయంలో ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు. ఉగ్రవాదుల దగ్గర నుంచి అమెరికా తయారీ రైఫిల్స్, తూటాలను, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు త్వరలోనే మరో భారీ దాడికి ప్రయత్నిస్తున్నట్టు అనుమానిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక

ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 29 , 2025 | 07:31 PM