Pahalgam Terror Attack: ‘పహల్గాం’ ఉగ్రవాదులు ఇప్పటికీ కశ్మీర్‌లోనే.. ఎన్ఐఏ వర్గాల అంచనా
ABN , Publish Date - May 01 , 2025 | 12:59 PM
పహల్గాం ఉగ్రవాదులు ఇప్పటికీ కశ్మీ్ర్‌లో ఉండి ఉండొచ్చని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరిసాయం లేకుండా మనగలిగేలా అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చినట్టు భావిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి జరిగి దాదాపు వారం కావస్తోంది. ఈ మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు అసువులు బాసారు. అయితే, ఈ దాడికి బాధ్యులైన ఉగ్రమూకల్లో కొందరు ఇప్పటికీ కశ్మీర్‌లోనే ఉండి ఉండొచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొందరు టెర్రరిస్టులు దక్షిణ కశ్మీర్‌లో దాగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం తమకు ఉందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి సమయంలో కొందరు ఉగ్రమూకలు హత్యాకాండకు దిగితే మరికొందరు ఈ దాడిలో పాల్గొనకుండా దూరంలో నిలబడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భద్రత దళాలు ఘటనా స్థలానికి వస్తే వారిపై దాడి చేసేందుకు వీలుగా ఈ వ్యూహం అనుసరించి ఉండొచ్చని భావిస్తున్నాయి.
స్థానికులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పహల్గాం ఉగ్రవాదులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఆహారంతో పాటు ఇతర నిత్యావసరాలను తమ వెంట తెచ్చుకున్నట్టు చెబుతున్నాయి. కశ్మీర్‌లో ఎక్కువకాలం పాటు కొనసాగేందుకు వీలుగా పక్కా ఏర్పాట్లతో వచ్చినట్టు అనుమానిస్తున్నాయి.
నిఘా వర్గాల ప్రకారం, దాడికి వారం మునుపే ఉగ్రవాదులు పహల్గాం చుట్టుపక్కల ఉన్న మూడు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. తొలుత ఓ ఉగ్రవాది స్థానికంగా ఉన్న ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్కును ఎంచుకున్నప్పటికీ, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండటం చూసి వెనక్కు తగ్గాడు. ఇక నిఘా వర్గాలకు చిక్కకుండా ఉండేందుకు టెర్రరిస్టులు అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను వాడారు. ఈ పరికరాలకు సిమ్ అవసరంం ఉండదు. వీటితో చిన్న సందేశాలను ఇతరులెవరూ గుర్తించేందుకు వీలులేకుండా ఎన్‌క్రిప్టెడ్‌గా పంపిచొచ్చు. దీంతో, ఆ సందేశాలపై అధికారులు నిఘా పెట్టలేకపోయారని తెలిసింది.
ఏప్రిల్ 22న పట్టపగలు ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. బైసరన్ మైదానం చుట్టూ ఉన్న అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులు ఒక్కసారిగా బయటకొచ్చి అమాయకులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడికి ప్రతిచర్యగా భారత్ సింధూ నదీజలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇటీవల పాక్ విమానాలకు భారత గగనతలాన్ని కూడా మూసేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మంత్రులకు అమెరకా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఫోన్ చేశారు. ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.. భారత్, పాక్‌లకు అమెరికా పిలుపు
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!
మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత
Read More Latest Telugu News and National News