Uddhav Thackeray: ఎంపీలందరి మద్దతు కోరుతా
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:06 AM
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరినీ కోరుతానని ప్రతిపక్షాల అభ్యర్థి బీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు..
ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
ముంబై, ఆగస్టు 29: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరినీ కోరుతానని ప్రతిపక్షాల అభ్యర్థి బీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి పార్టీలకు అతీతంగా ఎంపీలందరికీ లేఖలు రాస్తానని ప్రకటించారు. ఉపరాష్ట్రపతిగా తనకు అవకాశం లభిస్తే రాజ్యాంగాన్ని కాపాడతానని పేర్కొన్నారు. మహారాష్ట్రలో శుక్రవారం పర్యటించిన బీ సుదర్శన్ రెడ్డి.. శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఎన్‌సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్‌ను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన సుదర్శన్‌రెడ్డి.. ఉపరాష్ట్రపతి ఎన్నికను దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీగా చూడడం తగదన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ పార్టీలోనూ చేరే ఆలోచన కూడా లేదని చెప్పారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమతోపాటు మహావికాస్ అఘాడీలోని పార్టీలకు చెందిన ఎంపీలందరి మద్దతు ప్రతిపక్షాల అభ్యర్థికేనని తన కలిసిన బీ సుదర్శన్‌రెడ్డికి ఉద్దవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. దేశం మీద ప్రేమ ఉన్న ఎన్డీఏ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్‌రెడ్డికే ఓటేస్తారని ఠాక్రే తెలిపారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాజ్‌భవన్‌లో అరెస్టు చేయించిన వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి ఏం గౌరవం తీసుకొస్తారంటూ ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఉద్దేశించి ఎన్‌సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌పవార్ ప్రశ్నించారు. సీపీ రాధాకృష్ణన్ ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరేన్‌ను రాజ్‌భవన్‌లోనే అరెస్టు చేయించిన విషయాన్ని పవార్ గుర్తు చేశారు. రాధాకృష్ణన్‌కు వ్యవస్థలపై ఎలాంటి గౌరవం ఉందో ఆ అరెస్టు చెబుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో భేటీ అనంతరం పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, ఉపరాష్ట్రపతి పదవికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తూ వామపక్షాలు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటన విడుదల చేసిన వామపక్షాల్లో సీపీఐ (ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఆలిండియా ఫ్వార్వర్డ్ బ్లాక్ ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య పోరాటమని ఈ పార్టీలు పేర్కొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..