Share News

Online Betting to Be a Crime: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. నేరం

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:00 AM

విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటమాడుతున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

Online Betting to Be a Crime: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. నేరం

  • కేంద్రం కీలక నిర్ణయం.. బిల్లుకు క్యాబినెట్‌ ఓకే

  • నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం

  • బెట్టింగ్‌ సొమ్మును బ్యాంకులు బదిలీ చేయొద్దు

  • రియల్‌-మనీ గేమింగ్‌పై ప్రచారం నిషేధం

  • బిల్లులో పలు ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 19: విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటమాడుతున్న ‘ఆన్‌లైన్‌ బెట్టింగ్‌’ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ వేదికల ద్వారా నగదు పందాలను నేరంగా పరిగణిస్తూ ‘ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు’ను సిద్ధం చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే అన్ని నగదు ఆధారిత గేమింగ్‌ లావాదేవీలపై నిషేధం అమలులోకి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చట్టాన్ని ఉల్లంఘంచే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపాయి. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల తరఫున ఎవరైనా ప్రచారం చేస్తే జరిమానా విధించేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా.. రియల్‌ మనీ ఆన్‌లైన్‌ గేమ్స్‌కు సంబంధించిన సొమ్మును బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు బదిలీ చేయకూడదన్న నిబంధనను ఈ బిల్లులో పొందుపరిచారు. దీని ప్రకారం రియల్‌-మనీ ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రచారం చేయడం పూర్తిగా నిషిద్ధం. నమోదు కాని గేమింగ్‌ ప్లాట్‌ఫాంలపైనా కఠిన చర్యలను ప్రతిపాదించారు. గతంలోనే ఆన్‌లైన్‌ గేమింగ్‌పై దృష్టి పెట్టిన కేంద్రం... 2023 అక్టోబరులోనే ఆ ప్లాట్‌ఫాంలపై 28 శాతం వస్తు సేవ పన్ను (జీఎస్టీ) విధించింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌లో గెలుచుకున్న సొమ్ముపై 2024-25 నుంచి 30 శాతం పన్ను వసూలు చేస్తోంది. విదేశీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆపరేటర్లను కూడా మన దేశ పన్ను పరిధిలోకి తెచ్చింది. 2022 నుంచి ఇప్పటి వరకు 1,400కు పైగా బెట్టింగ్‌ వెబ్‌సైట్లను, ప్లాట్‌ఫాంలను స్తంభింపజేసింది. పిల్లల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఒక వ్యసనంగా మారి.. వారి జీవితాలను ప్రమాదంలో పడేస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ ఇప్పటికే తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా, ‘బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌’ నియంత్రణ అంశం రాష్ట్రాల జాబితాలో ఉంది. రియల్‌-మనీ గేమింగ్‌పై ఉక్కుపాదం మోపడంతో పాటు దేశమంతా ఒకే తరహా నిబంధనలతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అడ్డుకట్ట వేయవచ్చని కేంద్రం భావిస్తోంది.

Updated Date - Aug 20 , 2025 | 04:00 AM