Self Immolation Attempt: ఒడిశాలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు..
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:50 AM
ఒడిసాలో ఘోరం జరిగింది. కాలేజీలో తనపై ప్రొఫెసర్ పాల్పడుతున్న లైంగిక వేధింపులను భరించలేక..
ఒంటికి నిప్పంటించుకున్న విద్యార్థిని
న్యూఢిల్లీ, జూలై 14: ఒడిసాలో ఘోరం జరిగింది. కాలేజీలో తనపై ప్రొఫెసర్ పాల్పడుతున్న లైంగిక వేధింపులను భరించలేక.. యాజమాన్యానికి, ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించడం లేదన్న మనోవేదనతో 22 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. కాలేజీ కారిడార్‌లోనే ఒంటికి నిప్పంటించుకుంది. 95శాతం మేర గాయాలతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆమెను మంటల్లోంచి కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి 70శాతం మేర గాయాలయ్యాయి. బాలాసోర్‌లోని ఫకిర్ మోహన్ అటానమస్ కాలేజీలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలు ఆ కాలేజీలో బీఈడీ చదువుతోంది. విభాగాధిపతి సమీర్ కుమార్ కొన్నినెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని... అకడమిక్ కెరీర్‌ను నాశనం చేసి, భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారని జూలై 1న ఆమె కాలేజీ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసి 10రోజులైనా యాజమాన్యం స్పందించడం లేదని, పైగా కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ బాధితురాలు సోమవారం కాలేజీ ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ క్రమంలోనే ఒంటికి నిప్పంటించుకొంది.