Share News

JEE Main 2025: ఎన్‌టీఏ.. మళ్లీ అదే ‘తప్పు’!

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:05 AM

గత నెల నిర్వహించిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్‌-2025 సెషన్‌-1 తుది ఆన్సర్‌ కీ నుంచి తప్పులు దొర్లిన కారణంగా రికార్డు స్థాయిలో 12 ప్రశ్నలను (మొత్తం ప్రశ్నలు 90) తొలగించింది.

JEE Main 2025: ఎన్‌టీఏ.. మళ్లీ అదే ‘తప్పు’!

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలో రికార్డు స్థాయిలో 12 ప్రశ్నలు తొలగింపు

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తీరుపై విమర్శలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మరోసారి ‘తప్పు’ల సుడిగుండంలో చిక్కుకుంది. గత నెల నిర్వహించిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్‌-2025 సెషన్‌-1 తుది ఆన్సర్‌ కీ నుంచి తప్పులు దొర్లిన కారణంగా రికార్డు స్థాయిలో 12 ప్రశ్నలను (మొత్తం ప్రశ్నలు 90) తొలగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత భారీగా తప్పులు చోటుచేసుకొన్న నేపథ్యంలో ఎన్‌టీఏపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నలను ఉపసంహరించుకున్నప్పటికీ, జేఈఈ పరీక్షలో 0.6 శాతం పరిమితిగా ఉన్న ఎర్రర్‌ రేట్‌ 1.6 శాతానికి పెరిగింది. దీంతో ఎన్‌టీఏ పారదర్శకతపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపసంహరించుకున్న ప్రశ్నల్లో సిలబస్‌ పరిధి దాటినవి, అనువాదాలు దోషాలు ఉన్నవి ఉన్నాయని చెబుతున్నారు. నీట్‌, నెట్‌, జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షలు నిర్వహించే ఎన్‌టీఏ.. ప్రశ్నాపత్రాన్ని తయారు చేసే విషయంలో మరింత బాధ్యతగా ఉండాలని శృతిషా అనే విద్యార్థిని అన్నారు. ఈ పరీక్షల కోసం తన లాంటి విద్యార్థులు ఏళ్లుగా కష్టపడి చదుకుంటుంటారని, వారికి ప్రతి ప్రశ్నా ముఖ్యమైనదేనని, ఇలాంటి తప్పులను సహించలేమని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లడం ఇదే తొలిసారి కాదు. అయితే ఈసారి ఫైనల్‌ అన్సర్‌ కీ నుంచి తొలగించిన ప్రశ్నల సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువగా ఉండడం ప్రధానంగా చర్చకు దారితీసింది. దీంతో ఎన్‌టీఏ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది. గత ఏడాది జేఈఈ మెయిన్‌ సెషన్‌-1లో ఆరు, సెషన్‌-2లో నాలుగు ప్రశ్నలను తొలగించారు. 2021లో జరిగిన రెండు సెషన్లలో ప్రశ్నల్లో ఎలాంటి తప్పులు దొర్లలేదు.


అన్సర్‌ కీలో తప్పులు

కాగా, భాషా అనువాద దోషాలు పరీక్షా ప్రక్రియపై విశ్వాసాన్ని మరింత తగ్గిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. జేఈఈ మెయిన్‌-2025 సెషన్‌-1 అన్సర్‌ కీలో రెండు అనువాద లోపాలు ఉన్నాయని, ఇది గందరగోళానికి దారితీసిందని పేర్కొన్నారు. తప్పు సమాధానాలను సరైనవిగా గుర్తించడం వలన అదనపు వ్యత్యాసాలు ఏర్పడ్డాయని చెప్పారు. హిందీ, గుజరాతీ భాషల్లో పరీక్ష రాసే విద్యార్థులకు రెండు సమాధాన ఎంపికలు ఉండగా.. మిగతా విద్యార్థులకు ఒక ఆప్షన్‌ మాత్రమే ఉండడంతో న్యాయబద్ధతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘చాలా తప్పులు ఉన్నాయి. ఎన్‌టీఏ బాధ్యత తీసుకోవడం లేదా దీనిపై స్పష్టత ఇవ్వడం చేయలేదు. ఏ పరిష్కారం కూడా చూపడం లేదు’ అని ఢిల్లీలో జేఈఈ, నీట్‌ విద్యార్థులకు బోఽధించే జితేందర్‌ అహుజా అనే అధ్యాపకుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఏజెన్సీగా తప్పులు లేకుండా పరీక్ష నిర్వహించడం వారి బాధ్యత అని, గత అనుభవాల నుంచి ఏమీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదని విమర్శించారు. సిలబ్‌సలో లేని ప్రశ్నలు ఇవ్వడం ఎన్‌టీఐపై విశ్వాసాన్ని మరింత తగ్గించిందని అన్నారు. సిలబ్‌సలోని ప్రశ్నల కారణంగా పరీక్షలో చాలా సమయం కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. దీని పరీక్షలో తమ ప్రదర్శన, ర్యాంకుపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 05:05 AM