Share News

PM Modi: ఆర్గానిక్ ఉత్పత్తులకు కొత్త ప్రపంచం..

ABN , Publish Date - May 23 , 2025 | 01:21 PM

న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌‌ ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక అంశాలపై ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఓ వైవిధ్యం ఉందన్నారు. అదే ఆయా రాష్ట్రాలకు బలమని ఆయన పేర్కొన్నారు.

PM Modi: ఆర్గానిక్ ఉత్పత్తులకు కొత్త ప్రపంచం..
PM Modi

న్యూఢిల్లీ, మే 23: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఓ వైవిధ్యం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ వైవిధ్యమే ఈశాన్య రాష్ట్రాలకు బలమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశమే ఒక వైవిధ్యభరితమైన దేశమని, అలాంటి దేశంలో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతం అత్యంత వైవిధ్యభరితమైన భాగమని అభివర్ణించారు. శుక్రవారం న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల వైవిధ్యానికి వాణిజ్యం నుంచి సంప్రదాయం వరకు, వస్త్ర రంగం నుంచి పర్యాటకం వరకూ బలాన్ని ఇస్తుందన్నారు. టీ, వెదురు ఉత్పత్తులు, సహజ వాయువు, క్రీడలు, నైపుణ్యానికి ఈశాన్య రాష్ట్రాలు పర్యాయ పదమని చెప్పుకొచ్చారు. ఇక ఆర్గానిక్ ఉత్పత్తులకు సైతం ఈ రాష్ట్రాలు కొత్త ప్రపంచమని కీర్తించారు.


అలాగే దేశానికి ఈశాన్య ప్రాంతం శక్తి కేంద్రమన్నారు. కానీ తమకు మాత్రం ఈ రాష్ట్రాలు అష్టలక్ష్ములతో సమానమని ఆయన అభివర్ణించారు. ఈస్ట్ అంటే దిశ మాత్రమే కాదని.. EAST.. అంటే ఎంపావర్ (సాధికారత), యాక్ట్ (చర్య), స్ట్రేంథెన్ (బలోపేతం), పరివర్తన ( ట్రాన్స్‌ఫారమ్) అంటూ ప్రధాని మోదీ వివరించారు.

గతంలో ఈశాన్య రాష్ట్రమంటే.. సరిహద్దు ప్రాంతంగా మాత్రమే అంతా భావించేవారని గుర్తు చేశారు. కానీ ఆయా రాష్ట్రాలు నేడు అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నాయన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు.. పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా చేస్తాయన్నారు. అంతేకాకుండా అవి పెట్టుబడిదారులకు మరింత విశ్వాసాన్ని అందిస్తాయని చెప్పారు.


ఈశాన్యంలో తాము మౌలిక సదుపాయాల విప్లవాన్ని ప్రారంభించామని.. అది ప్రస్తుతం అవకాశాల భూమిగా మారుతోందని చెప్పారు. ఈశాన్యంలో అనుసంధానత మరింత బలపడుతోందని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈశాన్య ప్రాంతం పాత్ర బలపడుతోందన్నారు. దేశాభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాల ప్రాముఖ్యతను ప్రధాని మోదీ ఈ సందర్భంగా సోదాహరణగా వివరించారు. ఈశాన్య ప్రాంతంలోని ప్రతి రాష్ట్రం పెట్టుబడులకే కాదు.. నాయకత్వానికీ సిద్దంగా ఉన్నామని స్పష్టం చేస్తుందన్నారు. వికసిత్ భారత్‌లో భాగంగా తూర్పు భారతదేశం ప్రాముఖ్యతను ప్రధాని మోదీ వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్

పట్టపగలు బహిరంగంగా తిరుగుతున్న ఉగ్రవాదులు

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 01:49 PM