Share News

Centre Clarifies: సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను తొలగించే యోచన కేంద్రానికి లేదు

ABN , Publish Date - Jul 26 , 2025 | 02:55 AM

రాజ్యాంగం ప్రవేశిక నుండి సోషలిస్టు సెక్యులర్‌ పదాలను తొలగించే యోచన కేంద్ర ప్రభుత్వానికి ఏమీ లేదని కేంద్ర న్యాయశాఖ..

Centre Clarifies: సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను తొలగించే యోచన కేంద్రానికి లేదు

  • అవి రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టతనిచ్చింది

  • బయట జరిగే చర్చలకు ప్రభుత్వానికి సంబంధం లేదు: అర్జున్‌ మేఘ్వాల్‌

  • ఎస్పీ ఎంపీ ప్రశ్నకు లిఖితపూర్వక జవాబు

న్యూఢిల్లీ, జూలై 25: రాజ్యాంగం ప్రవేశిక నుండి ‘సోషలిస్టు’, ‘సెక్యులర్‌’ పదాలను తొలగించే యోచన కేంద్ర ప్రభుత్వానికి ఏమీ లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ స్పష్టం చేశారు. సోషలిజం అంటే మన దేశ పరిస్థితుల ప్రకారం సంక్షేమ రాజ్యమేగానీ ప్రైవేటురంగం వృద్ధిని అడ్డుకోవటం కాదని, అలాగే రాజ్యాంగం మౌలిక స్వరూపంలో సెక్యులరిజం అంతర్భాగమని సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పును మంత్రి ఉటంకించారు. ఈ మేరకు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. సోషలిస్టు, సెక్యులర్‌ పదాలు రాజ్యాంగం ప్రవేశికలో వాస్తవానికి లేవని తెలిపారు. 1976లో ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని చేర్చారని గుర్తు చేశారు. మధ్యలో చేర్చిన ఈ పదాలను తొలగించాల్సిన అవసరం ఉందని, దీనిపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సమాజ్‌వాదీపార్టీ ఎంపీ రాంజీలాల్‌ సుమన్‌.. ప్రభుత్వ వివరణ కోరారు. రాజ్యాంగం ప్రవేశిక నుండి సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను తొలగించటానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించటంలో భాగంగానే ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ సమాధానం ఇస్తూ.. రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఈ అంశంపై చర్చలు జరుగుతుండవచ్చుగానీ.. ప్రభుత్వం మాత్రం సదరు పదాలను తొలగించటంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదని, ఆ యోచన కూడా లేదని తెలిపారు. బయట జరుగుతున్న చర్చలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రవేశికలో ఏమైనా సవరణలు చేపట్టాలంటే సమగ్రమైన చర్చలు, విస్తృత ఆమోదంతోనే అది సాధ్యమని.. ప్రవేశికలో మార్పులు చేపట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 02:55 AM